ఆ నిధులు తిరిగి ఇస్తారా చర్యలు తీసుకొమంటారా? కేంద్రం వార్నింగ్

November 28, 2022


img

టిఆర్ఎస్‌-బిజెపి మద్య మొదలైన రాజకీయ ఆధిపత్యపోరు కాస్త ఇప్పుడు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య పోగా రూపాంతరం చెందింది. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెలంగాణ  సిట్ పోలీసులు బిజెపి పెద్దలకు వరుసగా నోటీసులిస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంపై కన్నెర్ర చేసింది. 

జాతీయ ఉపాది హామీ పధకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.132 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అనుమతిలేని ఇతర పనులకు వినియోగించినందున, 48 గంటల్లో ఆ సొమ్ముని తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ జారీ చేసింది. ఒకవేళ గడువులోగా చెల్లించకపోతే తదుపరి వాయిదాలను నిలిపివేస్తామని నోటీసులో హెచ్చరించింది. అంతేకాదు... గ్రామీణ ఉపాదిహామీ చట్టంలోని సెక్షన్ 27 ప్రకారం చర్యలు తీసుకోవలసి వస్తుందని కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. 

జాతీయ ఉపాది హామీ పధకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందిస్తున్న సొమ్ముని అది నిర్దేశించిన పనులకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. అయితే జాతీయ ఉపాది హామీ పధకంలో కొన్ని మార్పులు చేర్పులు అవసరమని సిఎం కేసీఆర్‌ వాదిస్తున్న సంగతి తెలిసిందే. కనుక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను చేపలు ఎండబెట్టే ప్లాట్‌ఫాంల నిర్మాణానికి, అడవుల్లో ట్రెంచ్‌ల తవ్వకం పనులకు తెలంగాణ ప్రభుత్వం వినియోగించింది. ఈ ఏడాది జూన్ 9 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం ఈ మేరకు నివేదిక తయారుచేసి కేంద్రానికి అందజేసింది. 

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య సరైన అవగాహన, సక్యత ఉన్నట్లయితే ఇటువంటివి సమస్యలుకాబోవు. కానీ సిఎం కేసీఆర్‌తో సహా మంత్రులు నేరుగా ప్రధాని నరేంద్రమోడీపైనే కత్తులు దూస్తున్నందున, కేంద్ర ప్రభుత్వం కూడా ధీటుగానే స్పందిస్తోంది. రెండు రోజులలో రూ.152 కోట్లు తిరిగి చెల్లించడం చాలా కష్టం. ఒకవేళ చెల్లిస్తే ఉపాదిహామీ పధకం కింద చేసిన ఆ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతుంది. చెల్లించకపోతే ఆ పధకం కింద రావలసిన నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. కనుక తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఇబ్బందిలో పడినట్లే భావించవచ్చు. 

దీంతో రెండు విషయాలు స్పష్టం అవుతున్నాయి. 1.కేంద్రంతో ఘర్షణ పడటం వలన యావత్ రాష్ట్రం నష్టపోవలసివస్తుంది. 2. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదనే టిఆర్ఎస్‌ వాదనలు అబద్దం. 


Related Post