తెలుగు సినిమా, భారతీయ సినిమాల స్థాయి, సత్తా ఏమిటో యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి. ఆయన మన తెలుగువారై ఉండటం మన అదృష్టం. బాహుబలితోనే తన విశ్వరూపం చూపిన రాజమౌళి దాని తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు, భారతీయ సినిమాలను మరో స్థాయికి తీసుకువెళ్ళారు. ఆర్ఆర్ఆర్ సినిమా విదేశీ భాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తుండటంతో రాజమౌళి ఆయా దేశాలలో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడానికి వెళుతున్నారు.
ప్రస్తుతం రాజమౌళి అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు అక్కడి సుప్రసిద్ద పత్రిక లాస్ ఏంజలీస్ టైమ్స్ ఆర్ఆర్ఆర్ సినిమాకి అమెరికాలో వస్తున్న గొప్ప స్పందన గురించి, రాజమౌళి, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల గురించి శుక్రవారం క్యాలండర్ పేజీలో రాజమౌళి ఫుల్ పేజీ ఫోటోతో ఓ ప్రత్యేక కధనం ప్రచురించింది. ఇది భారతీయ సినిమాకి, తెలుగు సినిమాకి లభించిన గౌరవంగానే భావించవచ్చు.
అంతర్జాతీయంగా కూడా ఇంత గొప్ప గుర్తింపు పొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాని మన భారతీయ ఆస్కార్ అవార్డుల కమిటీ పక్కన పెట్టేసింది. మన దేశానికి పేరు, ప్రతిష్టలు తెచ్చిపెట్టడం కంటే రాజకీయాలే ముఖ్యమని ఆ కమిటీ మరోసారి నిరూపించి చూపింది. భారత్ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ సినిమాని గుర్తించనప్పటికీ యావత్ ప్రపంచమూ దాని గొప్పదనం గుర్తిస్తోంది. భారత్ ప్రభుత్వం ఆర్ఆర్ఆర్ సినిమాని పక్కన పెట్టడంతో రాజమౌళి తన సినిమాని ఆస్కార్ అవార్డులకు పరిశీలించవలసిందిగా అస్కార్ అవార్డుల కమిటీకే నేరుగా దరఖాస్తు చేసుకొన్నారు. లాస్ ఏంజలీస్ తాజా కధనంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో ఉన్న టాప్ 10 చిత్రాలలో ఒకటి అని పేర్కొంది.
రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఈ ఆర్ఆర్ఆర్ సినిమా రెండు నెలల క్రితమే రూ.1,200 కోట్లు కలక్షన్స్ వసూలు చేసింది. ఇంకా దేశవిదేశాలలో సునామీ సృష్టిస్తూనే ఉంది. కనుక ఆర్ఆర్ఆర్ సినిమా కలక్షన్స్ రికార్డును బ్రేక్ చేయాలంటే మళ్ళీ రాజమౌళికే సాధ్యమేమో? రాజమౌళి-మహేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. బహుశః అది ఈ ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందేమో చూడాలి.
లాస్ ఏంజలీస్ పత్రికలో ప్రచురితమైన కధనం లింక్: https://www.latimes.com/entertainment-arts/movies/story/2022-11-18/rrr-ss-rajamouli-oscars