ఇంతకీ సిద్దూ ఎవరి తరపున ఆడుతాడో?

October 20, 2016


img

మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు భాజపాకి గుడ్ బై చెప్పేసి ఆవాజ్-ఏ-పంజాబ్ అనే పార్టీని పెట్టుకొన్న సంగతి తెలిసిందే. కానీ ఆ తరువాత ఏమయిందో తెలియదు కానీ తనది రాజకీయ పార్టీ కాదని కూటమి అని సిద్దూ ప్రకటించాడు. సిద్దూ ఎంట్రీతో పంజాబ్ రాజకీయాలలో వేడి పెరిగిన మాట వాస్తవమే కానీ మొదటే నిలకడగా వ్యవహరించలేకపోవడంతో ప్రజలకి తప్పుడు సంకేతాలు వెళ్ళాయి. కానీ తాజా సర్వేలు ఆయనని కింగ్ కాలేకపోయినా కింగ్ మేకర్ కావడం తధ్యమని స్పష్టం చేస్తున్నాయి. 

ఆ సర్వేల సంగతి ఎలాగున్నప్పటికీ వచ్చే ఏడాది జరుగబోయే పంజాబ్ శాసనసభ ఎన్నికలలో అన్ని స్థానాలకి తమ కూటమి పోటీ చేస్తుందని సిద్దూ ప్రకటించాడు. ప్రస్తుతం పంజాబ్ లో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్-భాజపా కూటమి ఆ ఎన్నికలలో ఓడిపోయే అవకాశం ఉందని తాజా సర్వేలు సూచిస్తున్నాయి. దానిని ఏదోవిధంగా ఒడ్డున పడేయడం కోసమే భాజపా సిద్దూని ఈవిధంగా రంగంలోకి దింపిందని ఆమాద్మీ పార్టీ వాదిస్తోంది. 

దాని వాదనలో నిజానిజాలు ఎలాగున్నప్పటికీ, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలకి విజయావకాశాలు ఉన్నాయని, కానీ రెంటికీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకి కొన్ని సీట్లు తక్కువ పడవచ్చని తాజా సర్వేలు సూచిస్తున్నాయి. కనుక సిద్దూని ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆయన తమతో చేతులు కలిపి తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహాయపడితే, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. 

ఆమాద్మీ పార్టీకి కూడా సిద్దు అవసరం ఉంది కనుక, బహుశః అది కూడా సిద్దూకి గాలం వేసేందుకు ప్రయత్నించవచ్చు. పంజాబ్ కి ముఖ్యమంత్రి కావాలనేది సిద్దూ కల. కనుక ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసినట్లయితే సిద్దూ ఆమాద్మీ టీమ్ లో చేరుతారేమో? 


Related Post