ఆ హీరోలు, దర్శకులు మారరా... ఈ ఎలివేషన్స్ ఏమిటో?

November 25, 2022


img

కొత్త హీరోలు, కొత్త దర్శకులు విలక్షణమైన కధాంశాలతో చక్కటి సినిమాలు తీసి ప్రజలను మెప్పిస్తుంటే, ఇండస్ట్రీలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్స్ మాత్రం మూస కధలు, రీమేక్ సినిమాలు చేసుకొంటూపోతున్నారు. గాడ్ ఫాదర్‌ సినిమా ప్రమోలో చిరంజీవి మాట్లాడుతూ, “నాకున్న స్టార్‌డం, నా సినిమాలపై ఆధారపడిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్స్ యజమానులు, అభిమానులు, వారి అంచనాలు అన్నిటినీ నేను దృష్టిలో పెట్టుకొని ఎవరూ నష్టపోకుండా అందరినీ మెప్పించాల్సి ఉంటుంది. అందుకే నేను ప్రయోగాలు చేయలేను,” అని చెప్పారు. 

నిజమే! కానీ ఆచార్య, గాడ్ ఫాదర్‌ వంటి సినిమాలతో మెప్పించగలిగారా? తనను నమ్ముకొన్నవారికి ఓ ఆర్ఆర్ఆర్‌లాగ, ఓ కాంతారాలాగ  లాభాలు ఆర్జించిపెట్టగలిగారా?అంటే సమాధానాలు అందరికీ తెలుసు. 

ఇక సినిమాలలో కధాంశం కంటే హీరోలని ఎలివేట్ చేసేందుకే దర్శకులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటం చూసినప్పుడు ఇంత అవసరమా? అని సామాన్య ప్రేక్షలులకి అనిపించకమానదు. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్‌ చూసినా, నేడు విడుదలైన జై బాలయ్య లిరికల్ వీడియో చూసినా ఇది అర్దం అవుతుంది. ఇదంతా అభిమానుల కోసమే అని వారు చెప్పుకొంటారు. మంచిదే. కానీ మిగిలిన ప్రేక్షకులందరికీ కూడా నచ్చేలా సినిమాలు ఉండాలి కదా?సినిమాలు హిట్ కూడా అవ్వాలి కదా? 

ఇక బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు ఒకప్పుడు ఎన్ని విలక్షణమైన పాత్రలు పోషించారో ఎన్ని విభిన్నమైన కధాంశాలతో సినిమాలు చేశారో అందరికీ తెలుసు. అటువంటి గొప్ప విలక్షణమైన నటులు నేడు గిరిగీసుకొని మూస కధలతో సినిమాలు చేస్తుండటం ఆనాటి వారి సినిమాలను చూసిన అభిమానులకు కాస్త బాధాకరంగానే ఉంటుంది. 

నిజానికి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలు ఇప్పటి నుంచే ప్రయోగాలు చేయడానికి సరైన సమయమని చెప్పవచ్చు. బాలీవుడ్‌లో అందరి కంటే సీనియర్ అయిన అమితాబ్ బచ్చన్ చేస్తున్న సినిమాలు, ప్రయోగాలు చూస్తే ఈ విషయం అర్దం అవుతుంది. ఒకప్పుడు ఆయన కమర్షియల్ సినిమాలు చేశారు. ఇప్పుడు తన వయసుకి తగ్గట్లుగా పూర్తి విలక్షణమైన కధలు, సినిమాలు చేస్తూ నేటికీ అందరినీ మెప్పిస్తున్నారు కదా?అలాగే జగపతిబాబు కెరీర్‌ ముగిసిపోయిందనుకొంటున్న సమయంలో ఆయన విలన్, క్యారక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకు షిఫ్ట్ అయిపోయి నేటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొంటున్నారు కదా?మరి మన సీనియర్ నటులు ఎందుకు అలా చేయలేకపోతున్నారనేదే ప్రశ్న!     

సోషల్ మీడియాలో వారి సినిమాల ఫస్ట్-లుక్‌, టీజర్‌, ట్రైలర్‌, లిరికల్ వీడియో, ప్రమో సాంగ్స్ వగైరాలను వారి అభిమానులు కూడా ఆకాశానికి ఎత్తేస్తున్నారు. హిపోక్రసీకి బందీ అయిన మీడియా కూడా ఈవిషయం ధైర్యంగా చెప్పలేక ‘వాహ్వా... వాహ్వా...’ అంటూ వారిని, వారి సినిమాలను పొగుడుతూ కాలక్షేపం చేసేస్తోంది. ఇవన్నీ కలిపి లేనిది ఉన్నట్లు ఓ ఊహాలోకం సృష్టించుకొని దానిలో విహరిస్తూ అందరూ ఆత్మవంచన చేసుకొంటునట్లుంది. కానీ ఇదేవిదంగా సాగుతుంటే నష్టపోతున్నది ఎవరు? సదరు హీరోలు, దర్శకులు, నిర్మాతలు, వారిపైనే ఆధారపడిన సినీ పరిశ్రమే కదా?కనుక ఈ హిపోక్రసీ, ప్రశంశల నుంచి మన సీనియర్ హీరోలు బయటపడి ఆనాడు ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్‌బాబు వంటివారు చేసినట్లు విలక్షణమైన పాత్రలు, కధలతో సినిమాలు చేస్తూ మరో చరిత్ర సృష్టించుకోవాలి. అప్పుడే తెలుగు సినీ పరిశ్రమకు మరింత గుర్తింపు, వైభవం లభిస్తాయి.     

Related Post