అక్కడ ఖర్గే, ఇక్కడ రేవంత్‌... కాంగ్రెస్‌ టైటానిక్ కెప్టెన్స్

November 25, 2022


img

తెలంగాణ ఏర్పడితే ఇక కాంగ్రెస్‌కు తిరుగే ఉండదనుకొంటే అప్పటి నుంచే కాంగ్రెస్‌ పతనం ప్రారంభం అయ్యింది. కనుక కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు వచ్చిన బాహుబలి రేవంత్‌ రెడ్డి చేతిలో పార్టీని పెట్టింది. అయితే అది రాష్ట్ర కాంగ్రెస్‌లో మరో చీలికకి దారి తీసి సీనియర్లు, రేవంత్‌ అనుచరులుగా విడిపోయి కత్తులు దూసుకొంటున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీని పనిగట్టుకొని ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదు. ఆ విషయం మునుగోడు ఉపఎన్నికలలో రుజువైంది కూడా. 

ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టు కధ ఇంకా ముగియనే లేదు. ఆయనని భరించలేక బయటకి పంపించలేక కాంగ్రెస్‌ ఇబ్బంది పడుతోంది. ఇక టిఆర్ఎస్‌ బంగారి పుట్టలో వేలుపెడితే కుడుతుందని బిజెపికి అర్దమైంది కనుక అందుబాటులో ఉన్న కాంగ్రెస్‌లో నుంచే మర్రి శశిధర్ రెడ్డి వంటివారిని ఏరుకొని తీసుకుపోతోంది. ఈ లెక్కన వచ్చే ఎన్నికలలోగా రాష్ట్ర కాంగ్రెస్‌ ఖాళీ అయిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. కనుక మునిగిపోయే రాష్ట్ర కాంగ్రెస్‌ టైటానిక్ నావకి చివరి కెప్టెన్ రేవంత్‌ రెడ్డి అనే అనుకోవచ్చు. అయితే ఎన్నికల మంచుకొండని ఢీకొనే వరకు కాంగ్రెస్‌ టైటానిక్ షిప్పుని నడిపిస్తారా లేదా మద్యలోనే చేతులెత్తేస్తారో చూడాలి. 

ఇక అక్కడ జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. కాంగ్రెస్‌ టైటానిక్ స్టీరింగ్ ఆయన చేతిలోనే ఉన్నప్పటికీ సోనియా, రాహుల్, ప్రియాంకలే ఆయన చేయి పట్టుకొని తిప్పుతున్నారనే విషయం అందరికీ తెలుసు. కనుక వారు తిప్పమ్మనట్లు ఆయన స్టీరింగ్ తిప్పుతూ మంచుకొండ వైపు నడిపిస్తున్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల కోసం పావులు కదుపుతున్న బిజెపియేతర పార్టీలతో కలిసి పనిచేసేందుకు సన్నాహాలు చేసుకొని ఉండేవారేమో? కనుక ఇక్కడ రేవంత్‌ రెడ్డి, అక్కడ ఖర్గే ఇద్దరూ మునిగిపోబోతున్న కాంగ్రెస్‌ టైటానిక్ షిప్పుకి చివరి కెప్టెన్స్‌ అని భావించవచ్చు.


Related Post