మంత్రి మల్లారెడ్డి ఆవేశంతో మరో కొత్త సమస్య?

November 25, 2022


img

మంత్రి మల్లారెడ్డిపై బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన ఇళ్ళు, కార్యాలయాలు, కాలేజీలపై రెండు రోజులు దాడులు నిర్వహించిన ఐ‌టి అధికారులలో రత్నాకర్ అనే అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బుదవారం రాత్రి మంత్రి కుమారుడు మహేందర్ రెడ్డి వద్ద ఈ సోదాలకు సంబందించినా పత్రాలపై సంతకాలు తీసుకొంటుండగా ఆయన వచ్చి తన చేతిలో ఆ పత్రాలను, ల్యాప్‌టాప్‌, సెల్ ఫోన్‌ బలవంతంగా లాక్కొని, ఆధారాలను నాశనం చేసేందుకు ప్రయత్నించారని, డ్యూటీలో ఉన్న తనపై దౌర్జన్యం చేశారని, తనను బలవంతంగా కారులో ఎక్కించుకొని తన ఇంటికి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్ళారని ఐ‌టి అధికారి రత్నాకర్ గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు పోలీస్ స్టేషన్‌ను వచ్చి ఫిర్యాదు చేశారు. 

ఆయన ఫిర్యాదు చేయడానికి వచ్చిన కొద్ది క్షణాలకే కేంద్ర బలగాలు బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ను చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకొని మెయిన్ గేటుకి తాళం వేయించి కాపలాగా నిలిచాయి. రత్నాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్‌తో మంత్రి మల్లారెడ్డిపై సెక్షన్స్ 379 (చోరీ), 342 (నిర్బందించడం), 353 (భౌతిక దాడి), 201 (నేరానికి సంబందించిన సాక్ష్యాధారాలను మాయం చేయడం), 506 రెడ్ అఫిడవిట్‌లో 34 (నేరపూరిత బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. 

అదే సమయంలో మంత్రి మల్లారెడ్డి కేసు నమోదు చేస్తున్న సీఐకి ఫోన్‌ చేయగా అక్కడే ఉన్న కేంద్ర బలగాలు సీఐని మాట్లాడనీయలేదు. లోపల కేసు నమోదు చేస్తున్న సమయంలోనే మంత్రి మల్లారెడ్డి అనుచరుడు ఒకరు ఐ‌టి అధికారి రత్నాకర్ వద్ద నుంచి తీసుకొన్న ల్యాప్‌టాప్‌ని పోలీస్ స్టేషన్‌కి తీసుకువచ్చి అప్పగించబోతే కేంద్ర బలగాలు అతనిని లోనికి అనుమతించలేదు. దాంతో ఆ ల్యాప్‌టాప్‌ని అక్కడే పెట్టి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సీఐ పంచనామా నిర్వహించి దానిని పోలీస్ స్టేషన్‌లోనే భద్రపరిచారు. 

తెల్లవారుజామున సుమారు 4 గంటల వరకు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ తతంగం నడిచింది. పోలీసులు మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు చేసిన తర్వాతే ఐ‌టి అధికారి రత్నాకర్, ఆయనతో బాటు కేంద్ర బలగాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. 

అంతకు ముందు మంత్రి మల్లారెడ్డి కూడా అదే పోలీస్ స్టేషన్‌లో ఐ‌టి అధికారి రత్నాకర్‌పై ఫిర్యాదు చేశారు. అతను తన కొడుకుని భయపెట్టి, బెదిరించి బలవంతంగా తప్పుడు ఆరోపణలతో ఉన్న పత్రాలపై సంతకాలు చేయించారని ఫిర్యాదు చేశారు. మంత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఐ‌టి అధికారి రత్నాకర్‌పై కూడా కేసు నమోదు చేశారు. 

ఈ రెండు కేసులు దిండిగల్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోనివి  కావడంతో నిన్న ఉదయం 11 గంటలకు దుండిగల్ సీఐ రమణారెడ్డి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఆ రెండు కేసుల జీరో ఎఫ్ఐఆర్ పత్రాలను తీసుకువెళ్లారు.


Related Post