కేవలం ఏడేళ్ళలోనే తెలంగాణ రాష్ట్రం పచ్చబడింది…

November 24, 2022


img

తెలంగాణ ప్రభుత్వం హరితహారం, పట్టణ ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలు, ఆక్సిజన్ పార్కులు పేరిట ఏటా భారీగా మొక్కలను నాటించి సంరక్షిస్తుండటంతో ఈ 8 ఏళ్లలో రాష్ట్రంలో పచ్చదనం చాలా భారీగా పెరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015-16లో 19,854 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో చెట్లు ఉండగా, 2017 నాటికి 20,419 చ.కిమీ, 2019 నాటికి 20,582 చ.కిమీ, 2021 నాటికి 21,214చదరపు కిలో మీటర్లకు విస్తరించాయి. అంటే 2015 నుంచి 2021 వరకు 1,360 చదరపు కిమీ మేర రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్న మాట!

ఒక్క 2019-2021 సంవత్సరాల మద్యనే రాష్ట్రంలో 632 చదరపు కిమీ మేర పచ్చదనం పెరిగింది. ఈ నెల 19వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ‘హ్యాండ్ బుక్’లో గత రెండేళ్ళ దేశంలో వివిద రాష్ట్రాలలో పచ్చదనం ఏమేరకు పెరిగిందో పేర్కొంది. వాటిలో అతిపెద్ద రాష్ట్రాలైన మద్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ కేవలం 11, 12 చదరపు కిమీ మేర మాత్రమే అటవీ విస్తీర్ణం పెరిగినట్లు పేర్కొంది. గుజరాత్‌లో 69 చ.కిమీలు, కర్ణాటకలో 155 చ.కిమీ, తెలంగాణ రాష్ట్రంలో 632 చ.కిమీ మేర పచ్చదనం పెరిగినట్లు పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం పచ్చదనం పెంచేందుకు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ వలన రాజధాని హైదరాబాద్‌ నగరంలో కూడా గణనీయంగా పచ్చదనం పెరిగింది. ఇటీవల డ్రోన్ కెమెరాలతో ఉప్పల్ వద్ద నిర్మిస్తున్న స్కై వాక్ ఫోటోలను చిత్రీకరిస్తున్నప్పుడు దానికి సమీపంలో దట్టంగా అడవిలా పెరిగిన చెట్లు కనిపించాయి. రాష్ట్రం అభివృద్ధి అంటే పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవడం, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలను సాధించుకోవడం, రోడ్లు, ఫ్లైఓవర్లు నిర్మించుకోవడం మాత్రమే కాదు పచ్చదనం పెంచడం కూడా అభివృద్ధిలో భాగమని తెలంగాణ ప్రభుత్వం నిరూపించి చూపుతూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.              Related Post