రాష్ట్ర రాజకీయాలా... జాతీయ రాజకీయాలా? కేసీఆర్‌ పయనం ఎటూ?

November 22, 2022


img

సిఎం కేసీఆర్‌ టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొంటున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ దృష్టి పెడతారని అందరూ భావించారు. అయితే రాష్ట్రంలో ఈడీ, ఐ‌టి దాడుల నేపధ్యంలో పార్టీ నేతలెవరూ చేజారిపోకుండా కాపాడుకోవలసిన అత్యవసర పరిస్థితి కనిపిస్తోంది. టిఆర్ఎస్‌ నేతలపై ఇలాగే ఈడీ, ఐ‌టి దాడులు కొనసాగుతున్నట్లయితే వారు ఆ ఒత్తిడి భరించలేక టిఆర్ఎస్‌ను వీడి బిజెపిలో చేరే ఆలోచనలు చేసినా ఆశ్చర్యం లేదు. 

తమ తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే అని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మొదలు రాష్ట్ర బిజెపి నేతల వరకు అందరూ గట్టిగానే చెపుతున్నారు. రాబోయే ఎన్నికలలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని కూడా విస్పష్టంగా చెపుతున్నారు. 

ఆ ప్రయత్నంలో టిఆర్ఎస్‌ నేతలను నయాన్న లోబరుచుకోవడానికి ప్రయత్నించి కేంద్ర ప్రభుత్వం భంగపడింది. అది వేరే విషయం. ఇప్పుడు ఈడీ, ఐ‌టి దాడులతో భయన్న లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. కనుక ఇటువంటి సమయంలో సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించుతానంటూ జాతీయ రాజకీయాలలో తిరిగితే ఇక్కడ టిఆర్ఎస్‌ ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కనుకనే కేసీఆర్‌ అత్యవసరంగా టిఆర్ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించి ముందస్తు ఎన్నికలు ఉండవని, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్లు ఇస్తామని హడావుడిగా ప్రకటించినట్లు భావించవచ్చు. 

కేంద్రంలో బిజెపికి బలమైన ప్రత్యామ్నాయం ఏమీ లేదు కనుక మళ్ళీ బిజెపి అధికారంలోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బిజెపిని నమ్మి రాష్ట్రంలో అధికారం కట్టబెట్టకపోవచ్చు. కనుక టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయి. కనుక కేంద్రంలో మోడీ, ఇక్కడ కేసీఆర్‌ ప్రభుత్వాలు ఏర్పడితే అప్పుడు కేసీఆర్‌ మరో 5 ఏళ్ళు కేంద్రంతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. అది చాలా చాలా కష్టం. 

కనుక కేసీఆర్‌ బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలోకి వెళ్ళక తప్పదు. ఆయన తన ప్రభుత్వాన్ని, పార్టీని తన కుమారుడు కేటీఆర్‌, హరీష్‌ రావులకి అప్పగించయినా సరే వెళ్ళి మోడీ, అమిత్‌ షాలతో పోరాడక తప్పదని భావించవచ్చు. కానీ కేసీఆర్‌కి ఉన్న ఇటువంటి ఇబ్బందులు, పరిమితులు బిజెపికి, కేంద్రానికి ఉండవు. కనుక అది తెలంగాణతో సహా జాతీయ రాజకీయాలలో స్వేచ్ఛగా చక్రం తిప్పగలదు. కనుక జాగ్రత్త పడవలసింది కేసీఆరే తప్ప ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాలు కాదనే చెప్పాలి. కనుక కేసీఆర్‌ ఇటు రాష్ట్ర రాజకీయాలను, జాతీయ రాజకీయాలను బ్యాలన్స్ చేసుకొంటూ ఏవిదంగా ముందుకు సాగుతారో చూడాలి.


Related Post