అందుకే నేను రాణించలేకపోయాను కానీ తమ్ముడు పక్కా: చిరంజీవి

November 21, 2022


img

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవనంలో యర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. దాని పూర్వ విద్యార్ధి అయిన చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “నేను మనసులో ఏదైనా గట్టిగా అనుకొంటే ఆ పని పూర్తిచేసేవరకు మద్యలో వదలను. కానీ బ్రాకెట్లో చెప్పుకోవలసింది ఒకటి ఉంది. అది మీ అందరికీ తెలుసు. రాజకీయాలలో రాణించాలంటే బాగా రాటుతేలిపోయి ఉండాలి. సున్నితంగా ఉంటే కుదరదు. కనుక నేను  వాటిలో ఇమడలేక తిరిగి సినీ పరిశ్రమకు వచ్చేశాను. అయితే తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కి ఆ నేర్పు, ఓర్పు రెండూ ఉన్నాయి. మాట కాయగలడు.. అవసరమైతే ఓ మాట అనగలడు కూడా. కనుక తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌కి తోడుగా మీరంతా ఉన్నారు. కనుక పవన్‌ కళ్యాణ్‌ తప్పకుండా భవిష్యత్‌లో అత్యున్నతమైన స్థానం చేరుకొంటాడు. అతనికి అది మనం అందరం చూడబోతున్నాము,” అని అన్నారు. 

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌ సొంత అన్నదమ్ములే అయినా ఇద్దరూ భిన్న ధృవాలవంటి వారు. చిరంజీవి చాలా ఆచితూచి మాట్లాడుతుంటారు. నిర్ణయాలు తీసుకొంటుంటారు. కానీ తాను రాజకీయాలలో ఒంటరిగా నెగ్గుకురాలేనని చాలా త్వరగానే గ్రహించి, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్రమంత్రి పదవి పొందారు. ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకొని సినీ పరిశ్రమకు తిరిగివచ్చారు. 

కానీ పవన్‌ కళ్యాణ్‌ కాస్త ఆవేశపరుడు. ఏ అంశంపైనైనా, ఎవరితోనైనా నిర్భయంగా మాట్లాడగలిగే ధైర్యం ఉంది. సమస్యలను ఎదురొడ్డి పోరాడే దమ్ము, ధైర్యం, సహనం అన్నీ పుష్కలంగా ఉన్నాయి. కనుకనే జనసేనకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా నేటికీ రాజకీయాలలో నిలబడున్నారు. 

ఇటీవల ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యేకంగా భేటీ అయిన తర్వాత “నేను ముఖ్యమంత్రి అభ్యర్ధిని” అని చెప్పుకొంటున్నారు. ఏపీ బిజెపి కూడా ఆయనకు మద్దతు తెలిపింది. కనుక ఏపీలో బిజెపి, జనసేనపార్టీల ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేయబోతున్నారని స్పష్టం అవుతోంది. 

బిజెపి వెనుక అత్యంత బలమైన కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ అమిత్‌ షా ఉన్నారు. వారు ఏ కారణంతో పవన్‌ కళ్యాణ్‌కి అండగా నిలబడినప్పటికీ అది ఆయనకు చాలా కలిసివచ్చే అంశమే. బహుశః అందుకే చిరంజీవి ఈవిదంగా చెప్పిన్నట్లు అర్దం అవుతోంది.

అయితే ఏపీలో బలమైన వైసీపీ, టిడిపిలు అధికారం కోసం పోరాడుకొంటుంటే పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి అవడం సాధ్యమా కాదా?అనే విషయాన్ని పక్కన పెడితే జీరో నుంచి ‘ముఖ్యమంత్రి అభ్యర్ధి’ స్థాయికి పవన్‌ కళ్యాణ్‌ ఎదిగారనే విషయం స్పష్టం అవుతోంది. ముందే చెప్పుకొన్నట్లు పట్టుదల, గుండె ధైర్యం కలిగి ఉండటం, రాజకీయాలలో ఎన్ని ఆటుపోటులు వచ్చినా తోక ముడిచి వెళ్లిపోకుండా నిలబడి పోరాడుతుండటం, ఆ కారణంగా చిరంజీవి చెప్పినట్లు రాజకీయాలలో రాటుతేలడం పవన్‌ కళ్యాణ్‌కి వచ్చే ఎన్నికలలో కాకపోయినా ఆ తర్వాత అయినా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండవచ్చు. 


Related Post