కవితక్కను అందరూ ఇలా ఆడేసుకొంటున్నారేమిటి?

November 19, 2022


img

సిఎం కేసీఆర్‌ కుమార్తె, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చెడ్డ రోజులు సాగుతున్నట్లున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో మొదలైన ఇబ్బందులు బిజెపిలో చేరాలని ఒత్తిళ్ళు ఎదుర్కోవడం, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించారంటూ ఎంపీ ధర్మపురి అరవింద్‌ బాంబ్ పేల్చడం తదనంతర పరిణమాలు చూస్తుంటే ఆమె గ్రహ స్థితిలో ఏదో సమస్య ఏర్పడినట్లు అనిపించకమానదు. 

ధర్మపురి అరవింద్‌తో మొదలైన గొడవ ఇంకా చల్లారాక మునుపే సీనియర్ కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈరోజు మరో బాంబు పేల్చారు. గత లోక్‌సభ ఎన్నికలలో ఆమె ఓడిపోవడానికి ఆమె వెన్నంటి ఉన్న టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలే అంటూ బాంబు పేల్చారు. ఆమె మళ్ళీ ఎంపీ అవడం ఇష్టం లేని టిఆర్ఎస్‌ పార్టీలో కొందరు ఆమెకు వెన్నుపోటు పొడిచారని లేకుంటే ఆమె తప్పకుండా గెలిచి ఉండేవారని జీవన్ రెడ్డి అన్నారు. ఆమె మళ్ళీ ఎంపీగా ఎన్నికైతే తమపై పెత్తనం చలాయిస్తారని కనుక ఆమెకు వెన్నుపోటు పొడిచారని జీవన్ రెడ్డి అన్నారు. 

ఇప్పటికే ఊహించని అనేక సమస్యలు, సవాళ్ళు ఒకదాని తర్వాత మరొకటి తరుముకొస్తుంటే వాటి నుంచి బయటపడేందుకు తిప్పలు పడుతున్న కల్వకుంట్ల కవితకి జీవన్ రెడ్డి పేల్చిన ఈ తాజా బాంబు మరో కొత్త ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఆమెకు పార్టీ నేతల నుంచి కూడా పూర్తి సహకారం లభించడం లేదని ఇది సూచిస్తోంది. 

ఒకవేళ జీవన్ రెడ్డి బయటపెట్టిన ఈ విషయం నిజమే అయ్యుంటే సిఎం కేసీఆర్‌కి, ఆమెకు ఇంతకాలం తెలియకుండా ఉండదు. ఆమెకు వెన్నుపోటు పొడిచారని తెలిస్తే కేసీఆర్‌ ఉపేక్షించరు కూడా. కానీ నిజామాబాద్‌లో ఒక్క ధర్మపురి శ్రీనివాస్‌ని పక్కన పెట్టడం తప్ప పార్టీలో ఎవరిపైనా వేటు వేసిన దాఖలాలు లేవు. 

అయినప్పటికీ జీవన్ రెడ్డి చిన్న చిచ్చు రగిలించారు కనుక నిజామాబాద్‌ టిఆర్ఎస్‌ శ్రేణుల్లో కాస్త గందరగోళం ఏర్పడవచ్చు. కానీ కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ కల్వకుంట్ల కవితని ఈవిదంగా టార్గెట్ చేస్తుండటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కేసీఆర్‌ కుటుంబంలో ఆమెను ఓ బలహీనమైన లింక్ అని భావించడం వలననే ఈవిదంగా చేస్తుండవచ్చు లేదా కేసీఆర్‌ ఆమెకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం వలన ఆమెలో అసంతృప్తిని రాజేసి  టిఆర్ఎస్‌ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నట్లు భావించవచ్చు. 


Related Post