బిజెపి ఉచ్చులో టిఆర్ఎస్‌ చిక్కుకొందా?

November 18, 2022


img

మునుగోడులో విజయం, టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో రాజకీయంగా బిజెపిపై పైచేయి సాధించగలిగింది టిఆర్ఎస్‌ పార్టీ. కానీ కల్వకుంట్ల కవిత బిజెపి, కాంగ్రెస్ పార్టీలలో చేరుతున్నారంటూ మొదలైన రగడ, టిఆర్ఎస్‌ కార్యకర్తలు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటిపై దాడి చేయడంతో బిజెపికి చేజేతులా అవకాశం కల్పించినట్లయింది. 

కల్వకుంట్ల కవితని బిజెపిలో చేరాలంటూ ఒత్తిడి చేశారని సిఎం కేసీఆర్‌ చెప్పుకోవడం ద్వారా టిఆర్ఎస్‌ బలహీనతను బయటపెట్టుకొన్నట్లయింది. ఏదో విదంగా టిఆర్ఎస్‌ నేతలను బిజెపిలో చేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నందున ఆమెను ఆకర్షించేందుకు నిజంగానే బిజెపి ప్రయత్నించి ఉండవచ్చు. అయితే సాక్షాత్ కేసీఆర్‌ కుటుంబంలో వ్యక్తులకే బిజెపి గాలం వేస్తోందంటే అర్దం ఏమిటి? కేసీఆర్‌ కుటుంబంలో అటువంటి అవకాశం ఉందనే కదా అర్దం?ఇదే విషయం ఆయనే స్వయంగా బయటపెట్టుకోవడం, తర్వాత కవిత కూడా నేడు దానిని ధృవీకరించడం ద్వారా ఇంతవరకు ఎవరికీ తెలియని టిఆర్ఎస్‌ బలహీనతను లోకానికి చాటి చెప్పుకొన్నట్లయింది. 

ఎన్నికలప్పుడు తన ప్రత్యర్ధులతో టిఆర్ఎస్‌ ఏవిదంగా మైండ్ గేమ్స్ ఆడుతుందో అదేవిదంగా బిజెపి కూడా ఆడినప్పుడు టిఆర్ఎస్‌ ఆ ఉచ్చులో చిక్కుకోవడం ఆశ్చర్యకరం. కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్‌ చేశారని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్‌ చెప్పడం మైండ్ గేమ్‌ అనే అర్దమవుతోంది. కేసీఆర్‌ కుటుంబం ఆమెను పక్కనపెట్టిందని, అందుకే ఆమె తన ప్రయత్నాలు తాను చేసుకొంటున్నారని బిజెపి నమ్మబలికింది. 

సాధారణంగా ఇటువంటి సందర్భాలలో చాలా ఆచితూచి మాట్లాడే ఆమె చంపేస్తా, చెప్పుతో కొడతా అంటూ సహనం కోల్పోయి మాట్లాడగా, టిఆర్ఎస్‌ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ధర్మపురి అరవింద్‌ ఇంటిపి దాడి చేయడం రాజకీయంగా మరో పెద్ద పొరపాటు అని చెప్పక తప్పదు. 

బిజెపి కోరుకొంటున్నది కూడా సరిగ్గా ఇటువంటి స్పందనే... ఇటువంటి పరిణామాలే. టిఆర్ఎస్‌ రెచ్చిపోతే జరిగేది అల్లరే. అదే జరిగింది. వెంటనే కేంద్ర మంత్రితో సహా రాష్ట్ర బిజెపి నేతలందరూ టిఆర్ఎస్‌ భౌతికదాడులకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండించారు. “వృద్ధురాలైన తన తల్లిపై దాడి చేసే హక్కు టిఆర్ఎస్‌కి ఎవరిచ్చారు?”అంటూ ధర్మపురి ఓ సెంటిమెంట్ అస్త్రం కూడా వేసేశారు. అది సామాన్య ప్రజలకు బాగానే కనెక్ట్ అవుతుందని వేరే చెప్పక్కరలేదు. 

“కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొంటున్నారు...” అని చెప్పినంత మాత్రన్న ఇంటిపై దాడి చేసేస్తారా?” అంటూ బిజెపి నేతలు నిలదీస్తున్నారు. ఈ ప్రశ్నకు టిఆర్ఎస్‌ వద్ద సమాధానం ఉండకపోవచ్చు. 

మునుగోడు ఓటమితో మూల కూర్చోవలసిన బిజెపి నేతలు ఈవిదంగా టిఆర్ఎస్‌ని, కేసీఆర్‌ కుమార్తెని పోలిటికల్ ర్యాంగింగ్ చేస్తుండటం ఆశ్చర్యకరమే కదా?అయితే టిఆర్ఎస్‌ పార్టీయే వారికి ఈ అవకాశం ఇచ్చిందని చెప్పవచ్చు. కనుక నష్ట నివారణ చర్యలు తప్పవు.


Related Post