చెప్పుతో కొడతా బిడ్డా: కల్వకుంట్ల కవిత

November 18, 2022


img

టిఆర్ఎస్‌ పార్టీలో గొప్ప వాగ్ధాటి, అపారమైన రాజకీయ అనుభవం, జ్ఞానం ఉన్న మహిళల నేతల్లో సిఎం కేసీఆర్‌ కుమార్తె, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధానమైనవారు. ఇంత సమర్దురాలైన ఆమె అప్రయత్నంగానే వివాదాలలో చిక్కుకొన్నారు. 1. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌. 2. బిజెపిలో చేరాలనే విషయం. 3. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాలనే విషయం. 

ఇటీవల టిఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో సిఎం కేసీఆర్‌ స్వయంగా కల్వకుంట్ల కవితని బిజెపిలో చేరాలని ఒత్తిడి చేశారనే విషయం బయటపెట్టారు. ఆ ఆరోపణని బండి సంజయ్‌ ఖండించినప్పటికీ, నేడు కల్వకుంట్ల కవిత స్వయంగా  సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సందేశంలో తనను బిజెపిలో చేరమని ఒత్తిడి చేసిన మాట వాస్తవమే అని కానీ తాను తెలంగాణ ప్రజలకు, టిఆర్ఎస్‌ పార్టీకి ద్రోహం చేయలేనని సవినయంగా తిరస్కరించానని చెప్పారు.

ఆమె ఈ మెసేజ్ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే నిజామాబాద్‌ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ మరో బాంబు పేల్చారు. “కల్వకుంట్ల కవిత కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకి ఫోన్‌ చేసి కాంగ్రెస్‌లో చేరాలనుకొంటున్నానని చెప్పారు. ఆ విషయం కాంగ్రెస్‌లో నా స్నేహితుడు ఒకరు నాకు ఫోన్‌ చేసి చెప్పారు. ఈ విషయం ఆమె స్వయంగా తండ్రికి లీక్ చేశారు కూడా,” అని చెప్పారు.  

కల్వకుంట్ల కవిత వెంటనే ఈ తాజా ఆరోపణలపై స్పందిస్తూ, “రాజకీయాలలోకి మహిళలు రావడానికి ఇందుకే భయపడుతున్నారు. నా వంటివారు ధైర్యం చేసి వస్తే ఇటువంటి అబద్దాలు ప్రచారం చేస్తూ మా మనోధైర్యం దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటారు. నేను ఖర్గేకి ఫోన్‌ చేశానేమో ఆయననే నేరుగా కనుక్కోండి. ఖర్గే ఓ సీనియర్ నాయకుడు. నా వంటివారు చాలా మంది పార్లమెంటులో ఆయనను కలుస్తుంటారు. ఆయన కూడా అందరితో స్నేహపూర్వకంగా ఉంటారు. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆయనని కలిశాను. మళ్ళీ ఇంతవరకు ఆయనతో మాట్లాడలేదు. ధర్మపురి అరవింద్ మరోసారి లైన్ దాటితే తరిమితరిమి కొడతాము. చెప్పుతో కొడతా. ఈసారి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా నేను అక్కడి నుంచే పోటీ చేసి ఓడగొట్టి ఇంటికి పంపిస్తా,” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ధర్మపురి అరవింద్ ఆమెపై ఈ ఆరోపణలు చేసిన కొద్ది సేపటికే టిఆర్ఎస్‌ కార్యకర్తలు బంజారాహిల్స్ లో ఆయన ఇంటిపై కర్రలు, రాళ్ళతో దాడులు చేశారు. రాష్ట్ర బిజెపి నేతలు ఈ దాడిని ఖండిస్తూ కేసీఆర్‌, కేటీఆర్‌, కవితలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 



Related Post