మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్, వామపక్షాలు పొత్తులు పెట్టుకొని విజయం సాధించాయి. మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్ధికి మద్దతుగా వామపక్షాలు వెనక్కు తగ్గాయి కనుక వాటిని పొత్తులు అనడం కంటే టిఆర్ఎస్‌కి వామపక్షాల మద్దతు అని చెప్పొచ్చు. తమ మద్దతుతోనే మునుగోడులో టిఆర్ఎస్ గట్టెక్కిందని వామపక్షాల నేతలు చెప్పుకొన్నారు కూడా. మున్ముందు కూడా తమ పొత్తులు కొనసాగుతాయన్నట్లు ఇరుపార్టీల నేతలు ఆనాడే సంకేతాలు ఇచ్చారు.
కానీ మునుగోడులో కలిసి పనిచేయడం వేరు... రాష్ట్ర స్థాయి ఎన్నికలలో కలిసి పోటీ చేయడం వేరు. కనుక రాబోయే శాసనసభ ఎన్నికలలో వామపక్షాలతో పొత్తులు కొనసాగించాలనుకొంటే, అవి కోరిన నియోజకవర్గాలలో సీట్లు కేటాయించక తప్పదు. వామపక్షాలు కనీసం 15-25 సీట్లు వరకు కోరుకొంటాయని గత ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపిలతో పొత్తులు పెట్టుకొన్నప్పుడే తేలింది. కనుక రాబోయే ఎన్నికలలో కూడా ఇంచుమించు అన్నే కోరుకోవచ్చు.
కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సిఎం కేసీఆర్ మళ్ళీ సీట్లు ఖరారు చేసేశారు. అయినప్పటికీ టిఆర్ఎస్‌లో ఒక్కో సీటుకి కనీసం ముగ్గురు నలుగురు ఆశావాహులున్నారు. కనుక కేసీఆర్ వామపక్షాలకి అన్ని సీట్లు ఇవ్వగలరా?అంటే కాదనే అర్దమవుతుంది. కనుక మునుగోడులో మాదిరిగానే వామపక్షాలు మళ్ళీ వెనక్కు తగ్గి టిఆర్ఎస్‌కు సహకరిస్తాయా?అంటే కాదనే చెప్పవచ్చు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిన్న మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌తో పొత్తుల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేము. కానీ తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో బిజెపిని వ్యతిరేకించేపార్టీలతో కలిసి పనిచేసేందుకు మేము సిద్దంగా ఉన్నాము,” అని చెప్పారు.
జాతీయ స్థాయిలో వామపక్షాలతో కలిసి పనిచేసేందుకు బిఆర్ఎస్‌గా మారుతున్న టిఆర్ఎస్‌కి ఎటువంటి అభ్యంతరమూ ఉండకపోవచ్చు. కానీ వామపక్షాలు నేటికీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనుకొంటుండటమే కేసీఆర్‌కు ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక టిఆర్ఎస్, వామపక్షాల పొత్తులు మునుగోడు వరకే పరిమితం అవుతాయా లేక శాసనసభ, లోక్‌బహిరంగసభలో ఎన్నికలలో కూడా కొనసాగుతాయా? అనే ప్రశ్నకు మరో 5-6 నెలల్లో సమాధానం దొరకవచ్చు.