మునుగోడు ఉపఎన్నికల హడావుడి పూర్తవడంతో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మళ్ళీ ప్రజాసంగ్రామ యాత్ర పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. ఈ నెల 28వ తేదీన నిర్మల్ జిల్లా ముధోల్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. ఈ 5వ విడతలో ముధోల్ నుంచి కరీంనగర్ వరకు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు.
మునుగోడు ఉపఎన్నికలలో తప్పకుండా గెలుస్తామనే నమ్మకంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత బిజెపి రాజీనామా చేయించి ఘోర పరాభవానికి గురైంది. అది కాక నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర బిజెపి నేతలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇంచుమించు ఒకేసమయంలో వరుసగా రెండు ఎదురుదెబ్బలు తిన్న తర్వాత బండి సంజయ్ రాష్ట్రంలో పాదయాత్రకు బయలుదేరుతున్నారు. ఇక విజయోత్సాహంతో ఉన్న టిఆర్ఎస్ శ్రేణులు ఆయనను అడుగడుగునా నిలదీయక మానవు. కనుక ఈసారి బండి సంజయ్‌కి ఈసారి పాదయాత్ర కాస్త ఇబ్బందికరంగానే ఉండవచ్చు. కానీ విజయోత్సాహంతో టిఆర్ఎస్ శ్రేణులు ఆయనపై దాడులకు పాల్పడినట్లయితే, వాటినే ఆయన తనకు, పార్టీకి అనుకూలంగా మార్చుకొని పోరాడటం కూడా ఖాయమే.