గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారంటూ పుకార్లు వస్తున్నాయి. వాటిపై ఆయన వెంటనే స్పందిస్తూ ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను టిఆర్ఎస్‌లో చేరుతున్నానని వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. ఆ పార్టీలో 28 ఏళ్ళు పనిచేసి నా జీవితాన్ని ధారపోస్తే, కేసీఆర్ నన్ను భూకబ్జాలకు పాల్పడ్డానని అవినీతి ముద్ర వేసి బయటకి పంపించేశారు. అంతకు ముందు టిఆర్ఎస్ పార్టీలో నాకు ఎన్ని అవమానాలు జరిగినప్పటికీ నేను మౌనంగా భరించానే తప్ప ఏనాడూ ఎవరికీ చెప్పుకోలేదు.
నా నిజాయితీ గురించి సిఎం కేసీఆర్‌కి కూడా తెలుసు. నా అంతట నేను పార్టీని విడిచిపెట్టి బయటకి రాలేదు. కేసీఆరే నన్ను బయటకు గెంటేశారు. కేసీఆర్ నన్ను ఇంతగా అవమానించిన తర్వాత ఆ పార్టీలో చేరుతానని ఎలా అనుకొంటున్నారు? ఈ ప్రచారం కూడా కేసీఆర్ మైండ్ గేమ్స్ లో భాగమే అని భావిస్తున్నాను. వచ్చే ఎన్నికలలో బిజెపి చేతిలో టిఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం,” అని ఈటల రాజేందర్ అన్నారు.
ఈటల రాజేందర్ చెప్పినట్లుగా ఆయన టిఆర్ఎస్‌లో చేరబోతున్నారనే ప్రచారం కేసీఆర్ మైండ్ గేమ్ అనే భావించవచ్చు. మునుగోడు ఉపఎన్నికలలో ఎదురుదెబ్బ తినడంతో బిజెపిలో అంతర్గత మధనం మొదలైంది. ముఖ్యంగా బిజెపిలో చేరిన టిఆర్ఎస్ నేతలలో ఆందోళన మొదలైతే ఆశ్చర్యం లేదు. కనుక అటువంటివారిని మళ్ళీ టిఆర్ఎస్‌లోకి రప్పించుకొనేందుకే బహుశః టిఆర్ఎస్ ఈ మైండ్ గేమ్స్ ఆడుతోందేమో?
ఈ ఉపఎన్నికలతో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు స్వల్ప మెజార్టీతో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ బిజెపి శక్తి సామర్ధ్యాలను బాగానే గుర్తించింది. బిజెపిని నిర్వీర్యం చేయకపోతే వచ్చే ఎన్నికలలో టిఆర్ఎస్ ఏటికి ఎదురీదక తప్పదని గ్రహించే ఉంటుంది. కనుక బిజెపిని దెబ్బ తీసేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడం ఖాయం. ఇదే విదంగా బిజెపి దాని వెనుకున్న కేంద్ర ప్రభుత్వం కూడా సిఎం కేసీఆర్‌ని, టిఆర్ఎస్‌ని దెబ్బ తీసేందుకు సకల ప్రయత్నాలు చేయడం కూడా ఖాయమే.