ఈడీ అధికారులు ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్, మరోవైపు క్యాసినో భాగోతాలని ఏకకాలంలో దర్యాప్తు చేస్తుండటంతో ఆ రెండు వ్యవహారాలలో ఏదో ఓ దానిలో మన రాజకీయనాయకుల పేర్లు బయటపడుతున్నాయి. క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఇంట్లో సోదాలు చేస్తే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని మహేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్ పేర్లు బయటకు వచ్చాయి. వారిరువురినీ ఈడీ అధికారులు నిన్న సుదీర్గంగా విచారణ జరిపారు. మళ్ళీ మరోసారి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ కేసులో తెలంగాణ టిడిపి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత టిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మెదక్ డిసీసీబి ఛైర్మన్ దేవేందర్ రెడ్డి, ప్రముఖ అంకాలజిస్ట్ వంశీల పేర్లు బయటకు వచ్చాయి. వారు ముగ్గురికీ కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు చీకోటి ప్రవీణ్‌ని మళ్ళీ ఈడీ అధికారులు నేడు, రేపు రెండు రోజుల పాటు ప్రశ్నిస్తున్నారు.
గత ఏడాది నేపాల్ రాజధాని ఖాట్మండూలో చీకోటి ప్రవీణ్ మరికొందరు వ్యక్తులతో కలిసి భారీ స్థాయిలో క్యాసినో నిర్వహించాడు. దానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వెళ్లారు. రెండు రోజుల పాటు సాగిన ఆ క్యాసినోలో వేలకోట్లు చేతులు మారాయని, ఆ సొమ్మంతా హవాలా మార్గంలో సదరు వ్యక్తులకు బదిలీ అయ్యిందని ఈడీ ఆరోపిస్తోంది.
విదేశాలలో క్యాసినో నిర్వహణపై ఎటువంటి ఆంక్షలు లేనప్పటికీ భారత్ నుంచి హవాలా ద్వారా డబ్బు విదేశాలకు తరలించడం, అక్కడి నుంచి మళ్ళీ వేరే వారి ఖాతాలకు మళ్ళించడం ఫెమా నిబందనలకు విరుద్దమని ఈడీ ప్రధాన ఆరోపణ. కనుక ఈ క్యాసినో తీగ లాగితే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ డొంకలన్నీ కదులుతున్నాయి. ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో? చివరికి ఈడీ హడావుడి ఎప్పుడు ఏవిదంగా ముగుస్తుందో?