కాదంటే ఔననిలే... ముందస్తు ఉందనిలే: బండి సంజయ్‌

November 17, 2022


img

సిఎం కేసీఆర్‌ మొన్న టిఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో ముందస్తు ఎన్నికలకి వెళ్ళబోవడం లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకి వెళ్తామని చెప్పడంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తనదైన శైలిలో స్పందించారు. “కేసీఆర్‌ అవునంటే కాదని... కాదంటే ఔనని అర్దం. ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకొంటున్నారు కనుకనే వెళ్ళడం లేదని చెపుతున్నారు. ముందస్తుకి వెళ్ళే ఉద్దేశ్యంతో ఉన్నారు కనుకనే హడావుడిగా ఈ సమావేశం ఏర్పాటు చేసి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్ళీ టికెట్స్ ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలతోనే టిఆర్ఎస్‌ ఎన్నికలకు వస్తే బిజెపి గెలుపు మరింత సులభం అవుతుంది. కనుక ఇందుకు నేను కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.   

మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ గెలిచినప్పటికీ కేసీఆర్‌ తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారు. అందుకే తన కుమార్తె కవితను కూడా రొంపిలోకి లాగుతున్నారు. తరచూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేసే కేసీఆర్‌నే మేము పట్టించుకొనప్పుడు ఆయన కుమార్తె కవితను మా పార్టీలో చేరాలని ఎందుకు ఒత్తిడి చేస్తాము?రాబోయే ఎన్నికలలో బిజెపి ఒంటరిగానే పోటీ చేసి తప్పకుండా అధికారంలోకి వస్తుంది. జనసేనతో పొత్తులు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం,” అని చెప్పారు. 

బండి సంజయ్‌ ఆత్మవిశ్వాసం, పోరాట స్పూర్తి అభినందనీయమే. ఆయన కారణంగానే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఇప్పుడు టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలబడగలిగిందని చెప్పవచ్చు. అయితే మునుగోడు ఉపఎన్నికలలో మొదలైన ఓ కొత్త చర్చపై ఆయన దృష్టి పెడుతున్నారా లేదో తెలీదు. ఈటల రాజేందర్‌, రఘునందన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన నేతలు బిజెపిలో ఎందరున్నారు?ఆ స్థాయి నేతలు లేకపోతే టిఆర్ఎస్‌లో హేమాహేమీలైన నేతలను రాబోయే ఎన్నికలలో బిజెపి ఏవిదంగా ఎదుర్కొని పోరాడగలదు?అసలు బిజెపికి అన్ని స్థానాలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులు ఉన్నారా?అనే చర్చ మునుగోడు ఉపఎన్నికలలో మొదలైంది. కనుక ఈ సమస్యను పరిష్కరించుకోకుండా ‘రాబోయే ఎన్నికలలో మేమే గెలుస్తాం... అధికారంలోకి వస్తాం...’ అని ఎన్నిసార్లు ఎంత గట్టిగా చెప్పుకొన్నా ప్రయోజనం ఉండదు.


Related Post