ఇంతవరకు సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీపై కత్తులు దూశారు. ఇప్పుడు మోడీ కూడా కత్తి దూసినట్లే ఉంది. మొన్న మంత్రి గంగుల కమలాకర్, ఆ తర్వాత టిఆర్ఎస్ ఎంపీ గాయత్రి రవి, ఇప్పుడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుల చుట్టూ ఈడీ ఉచ్చుబిగిస్తోంది.
క్యాసినో వ్యవహారాలలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తూ ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఇళ్ళు, కార్యాలయాలలో కొన్ని రోజుల క్రితం సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సోదాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు తలసాని మహేష్ యాదవ్, తలసాని ధర్మేంద్ర యాదవ్‌లకు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు కొన్ని ఆధారాలు లభించడంతో వారిరువురికీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తున్నారు.
వారి వ్యాపార లావాదేవాలకు సంబందించి గత నాలుగేళ్ళ రికార్డులను ఈడీ అధికారులు తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ హవాలా, మనీలాండరింగ్ నేరాలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు ప్రాధమికంగా నిర్ధారించుకొన్నారు. కనుక అతని వ్యాపారభాగాస్వాములుగా ఉన్న తలసాని సోదరులు ఇద్దరికీ కూడా ఈ మనీలాండరింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉండవచ్చనే అనుమానంతో ఈడీ అధికారులు వారిని నేడు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకా స్పందించవలసి ఉంది.