కేంద్రం చేసిన తప్పే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తోంది కదా?

November 15, 2022


img

కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐ‌టి శాఖలను తమపై ఉసిగొల్పి దాడులు చేయిస్తూ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ తదితరులు పలుమార్లు ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదేవిదంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సుశీ గ్రూపులోని సంస్థలపై జీఎస్టీ అధికారులతో దాడులు చేయించింది. 

రాష్ట్ర జీఎస్టీ కమీషనరేట్‌కి చెందిన 150 మంది అధికారులు 25 బృందాలుగా ఏర్పడి సోమవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి నుంచి 7 గంటల వరకు సుశీ గ్రూప్‌కి చెందిన 16 సంస్థలలో, వాటి డైరెక్టర్ల ఇళ్ళపై దాడులు నిర్వహించి పన్నుల రిటర్న్ పత్రాలతో సహా పలు కంప్యూటర్ హార్డ్ డిస్కులను, కీలకపత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. మునుగోడు ఉపఎన్నికలు జరుగుతున్నప్పుడు సుశీ గ్రూపుకి చెందిన ఓ కంపెనీ నుంచి మునుగోడులో కొంతమంది వ్యక్తుల బ్యాంక్ ఖాతాలకు భారీగా నగదు బదిలీలు అయ్యాయని టిఆర్ఎస్‌ కేంద్ర ఎన్నికల కమీషన్‌కి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 

ఇప్పుడు టిఆర్ఎస్‌ ప్రభుత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సంస్థలను టార్గెట్‌గా చేసుకొని దాడులు నిర్వహించడం రాజకీయ కక్ష సాధింపేనని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. కానీ సుశీ గ్రూప్ సంస్థలు వందల కోట్లు జీఎస్టీ పన్ను ఎగవేసాయనే సమాచారంతోనే వాటిపై దాడులు నిర్వహించామని అధికారులు చెపుతున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌, టిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు గాయత్రి రవి ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించడం, అంతకు ముందు ఎంపీ నామా నాగేశ్వరరావుకి చెందిన రూ.80 కోట్లను ఈడీ జప్తు చేయడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌లో ఈడీ సోదాలు, అరెస్టులకు ప్రతిచర్యగానే ఈ దాడులు జరిగినట్లు భావించవచ్చు. ఎందుకంటే, సుశీ గ్రూప్ సంస్థలు మునుగోడు ఉపఎన్నికలకు ముందు ప్రారంభించినవి కావు. దశాబ్ధాలుగా ఉన్నాయి. ఒకవేళ అవి పన్నుఎగవేస్తున్నట్లయితే టిఆర్ఎస్‌ అధికారంలోకి రాగానే వాటిపై దాడులు చేయించవచ్చు. కానీ ఇన్నేళ్ళు ఊరుకొని ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికల తర్వాత దాడులు చేయించడం రాజకీయ కక్ష సాధింపుగానే కనబడుతుంది. 

అయితే రాజకీయనాయకులు ఇంత అవినీతికి పాల్పడుతుంటే, తమపై ఈడీ, ఐ‌టి దాడులు చేయకూడదని, చేస్తే అది రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తుండటం పరిపాటిగా మారిపోయింది. ఇటువంటి దాడుల నుంచి తప్పించుకోవడానికే రాజకీయ నాయకులు అధికార పార్టీలలోకి మారుతుంటారని అందరికీ తెలుసు. కనుక ఏ పార్టీ, ఏ నాయకుడు కూడా నైతిక విలువలు పాటించడం లేదనే విషయం స్పష్టం అవుతోంది. 



Related Post