సూపర్ స్టార్ కృష్ణకి ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చేర్చినప్పటి నుంచి వివిద మీడియా సంస్థల ప్రతినిధులు హాస్పిటల్ వద్ద వాలిపోయి కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. అయితే వారు కేవలం న్యూస్ రిపోర్టింగ్ మాత్రమే చేస్తే ఎవరూ తప్పు పట్టలేరు. కానీ మిగిలిన అన్ని ఛానల్స్ కంటే మనమే ముందు కృష్ణ ‘చావు కబురు’ అందించాలని పోటీలు పడటమే చాలా దారుణం. మరోవిదంగా చెప్పాలంటే మీడియా రాబందుల్లా వ్యవహరిస్తోందని చెప్పకతప్పదు.
నాలుగు దశాబ్ధాల పాటు తెలుగు ప్రజలను తన సినిమాలతో అలరించిన మహా నటుడు కృష్ణ హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతున్నారని తెలిసినప్పుడు ఎవరికైనా చాలా బాధ కలుగుతుంది. కానీ ఆయన ఎప్పుడు చనిపోతారా ఆ వార్తని అందరికంటే ముందు తమ ఛానల్లో ప్రసారం చేసుకోవాలనే మీడియా ప్రతినిధుల ఆత్రం చూస్తున్నప్పుడు రాబందులే గుర్తుకువస్తాయి.
అంతవరకు కూడా ఆగలేని కొంతమంది కృష్ణ చనిపోయారంటూ పుకార్లు పుట్టించేశారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయిపోవడంతో చాలా మంది నిజమనే భావించారు కూడా. అయితే కృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు చనిపోయారని హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. ఓ మనిషి చావు గురించి మీడియాకి ఎందుకు ఇంత ఆత్రం?
కృష్ణ చనిపోయిన కొన్ని నిమిషాలకే చాలా ఛానల్స్‌లో ఆయన పుట్టుపూర్వోత్తరాలు, ఆయన స్వగ్రామం బుర్రిపాలెంలో గ్రామస్తులతో ఇంటర్వ్యూలు, ఆయన చేసిన సినిమాల విశేషాలన్నీ వచ్చేశాయి. బహుశః ముందుగానే అవన్నీ చేసిపెట్టుకొని ఉండవచ్చు. ఈరోజుల్లో ఇవన్నీ సర్వసాధారణమే అనుకోని సరిపెట్టుకొన్నా, ఇప్పుడు కృష్ణ భౌతికకాయం హాస్పిటల్ నుంచి నానక్‌రామ్ గూడలోని ఆయన నివాసానికి ఎంత సేపటిలో చేరుకొంటుంది?ఇంట్లో కుటుంబ సభ్యులు ఏవిదంగా బాధ పడుతున్నారు?కృష్ణ అంత్యక్రియలకు ఏవిదంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి?అంతిమయాత్ర ఎప్పుడు మొదలవుతుంది?అంటూ మీడియా ప్రతినిధులు రిపోర్టింగ్ చేసేస్తున్నారు.
ఒక ఆత్మీయుడి చావుకి బాధపడాల్సిందిపోయి తమ ఛానల్ టిఆర్‌పి పెంచుకొనేందుకు మంచి న్యూస్ దొరికిందని మీడియా భావిస్తుండటం చాలా బాధాకరం. కృష్ణ చనిపోయిన తర్వాత కూడా ఈవిదంగా న్యూస్ రిపోర్టింగ్ పేరుతో మీడియా అతిగా వ్యవహరిస్తోందని చెప్పకతప్పదు. అయితే ఇప్పుడు ఈ మీడియా పద్దతులన్నీ సర్వసాధారణం అయిపోయాయి కనుక ఎవరికీ తప్పుగా అనిపించడం లేదు. కానీ ఓ మనిషిని వల్లకాటి వరకు వెంబడించడాన్ని ఎటువంటి జర్నలిజం అనుకోవాలి?