రేపు టిఆర్ఎస్‌ఎల్పీ సమావేశం... ఎందుకో?

November 14, 2022


img

ప్రధాని నరేంద్రమోడీ మొన్న శనివారం తెలంగాణ పర్యటనకి వచ్చినప్పుడు సిఎం కేసీఆర్‌ ఆయనకు మొహం చాటేయడమే కాకుండా వివిద సంఘాల చేత అడుగడుగునా నిరసనలు తెలియజేయించారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా గతంలో ఎన్నడూ లేనివిదంగా కేసీఆర్‌  ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయంటూ ఘాటుగా హెచ్చరికలు చేశారు. మోడీ తెలంగాణలో పర్యటించే ముందే ఈడీ అధికారులు మంత్రి గంగుల కమలాకర్‌, టిఆర్ఎస్‌ ఎంపీ గాయత్రి రవి ఇల్లు, కార్యాలయాలలో సోదాలు చేశారు. 

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందం, దర్యాప్తులో భాగంగా తిరుపతి, చెన్నై, హైదరాబాద్‌, హర్యానాలో నిందితుల, వారి బంధువుల ఇళ్ళలో సోదాలు జరుపుతున్నారు. అంటే కేసీఆర్‌ కూడా తగ్గేదేలే అంటున్నారనుకోవచ్చు. కనుక మోడీ-కేసీఆర్‌ మద్య యుద్ధం మరోస్థాయికి చేరుకొన్నట్లు అర్దం అవుతోంది.

ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ముగించుకొని ఢిల్లీ తిరిగివెళ్ళిపోయిన తర్వాత సిఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ పెడతారనే ఊహాగానాలు వినిపించాయి కానీ మంగళవారం తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. 

సాధారణంగా అసెంబ్లీ లేదా పార్లమెంట్ సమావేశాలకు ముందు టిఆర్ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహిస్తుంటారు. రెండు నెలల క్రితమే అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ఇంకా ఖరారు కానేలేదు. కనుక ఈ సమావేశం వాటి కోసం కాదని స్పష్టం అవుతోంది. 

టిఆర్ఎస్‌ పేరుని బిఆర్ఎస్‌గా మార్చాలని కోరుతూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమీషన్‌కు దరఖాస్తు చేసుకొని నిబందనల ప్రకారం పేరు మార్పుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయమని కోరుతూ న్యూస్ పేపర్లలో ప్రకటన కూడా ఇచ్చారు. కనుక త్వరలోనే బిఆర్ఎస్‌ సిద్దం అవుతుంది. అప్పుడు బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో తొలి అడుగు ఎక్కడి నుంచి ఏవిదంగా మొదలుపెట్టాలి? దేశవ్యాప్తంగా వివిద రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించడంపై ఈ సమావేశంలో చర్చించవచ్చని తెలుస్తోంది. 


Related Post