నేడు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్రమోడీకి జాతికి అంకితం చేసిన తర్వాత బహిరంగసభలో మాట్లాడుతూ, మరోసారి కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సింగరేణి గనుల ప్రయివేటీకరణపై ప్రధాని మోడీ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి గనులలో రాష్ట్ర ప్రభుత్వానికి 51%, కేంద్ర ప్రభుత్వానికి 49% వాటాలు ఉన్నాయని అటువంటప్పుడు కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను ఏవిదంగా ప్రైవేటీకరణ చేయగలదని ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే తన ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తన ప్రభుత్వం ఎన్నడూ సింగరేణి గనులను ప్రైవేటీకరించే ఆలోచన కూడా చేయలేదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు.
అయితే దేశవ్యాప్తంగా వివిద బొగ్గు గనులతో పాటు సింగరేణిలో గనుల వేలానికి కేంద్ర సిద్దం అవడంతో, దీని గురించి కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు. దానిలో కళ్యాణి ఖని బ్లాక్-6, కోయగూడెంలోని బ్లాక్-3, సత్తుపల్లిలో బ్లాక్6, శ్రావనపల్లిలో ఒక బ్లాకుని 2021, డిసెంబర్‌లో వేలం వేసేందుకు టెండర్లు పిలిచామని కానీ వాటిలో ఒక్క కోయగూడెం బ్లాకుకి మాత్రమే ఒకే ఒక టెండర్ వచ్చిందని కనుక వేలం నిలిపివేశామని తెలిపారు. ఆ బ్లాకులను సింగరేణికే కేటాయించాలని తమకు విజ్ఞప్తి అందిందని కానీ ఆ విదంగా చేస్తే దేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇటువంటి వినతులే వస్తాయి కనుక వాటిని సింగరేణి సంస్థకు కేటాయించలేమని, కావాలంటే మళ్ళీ తదుపరి వేలంపాటలో సింగరేణి సంస్థ కూడా పాల్గొనవచ్చని తెలిపామని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు.
తదుపరి వేలంలో సింగరేణి సంస్థ పాల్గొంటుందా లేదా?వేలంపాటలో వాటిని దక్కించుకొంటుందా లేదా? అనే విషయాన్ని పక్కనపెడితే, సింగరేణి గనులలో కేంద్రం తన వాటాలోని గనులను వేలంపాట ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు సిద్దపడిందని అర్దమవుతోంది. కానీ సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని ప్రధాని నరేంద్రమోడీ చెపుతున్నారు. అంటే ఆయన ఉద్దేశ్యంలో సింగరేణి సంస్థలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలను అమ్మడం లేదని, కనుక ఆ సంస్థను, యాజమాన్యాన్ని, కార్మికులను ప్రభావితం చేసే ఎటువంటి నిర్ణయమూ తీసుకోవడం లేదని చెప్పినట్లు భావించవచ్చు.