ఎప్పుడూ నెగెటివ్ వార్తలేనా? తెలంగాణలో అభివృద్ధి చూపలేరా?

November 12, 2022


img

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ శనివారం హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన ‘మీడియా ఇన్‌ తెలంగాణ’ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయ్యి చాలా ఆసక్తికరమైన, ఆలోచింపదగ్గ ప్రసంగం చేశారు. 

“తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్ని పత్రికల యాజమాన్యాలు వ్యతిరేకించగా వాటిలో పనిచేసే జర్నలిస్టులు మాత్రం ఉద్యమాలకి సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా ఢిల్లీ వరకు వచ్చి మరీ పోరాడారు. నేటికీ కొన్ని పత్రికలు తెలంగాణ ప్రభుత్వం గురించి తప్పుగానే వ్రాస్తుంటాయి. 

యావత్ దేశాన్ని కరోనా మహమ్మారి వణికించేస్తుంటే హైదరాబాద్‌ నగరంలో 9 బిలియన్ కరోనా వాక్సిన్లు ఉత్పత్తి చేసింది. ఆ విషయం మీడియాకు గొప్పగా అనిపించలేదు. హైలైట్ చేయలేదు! రాష్ట్రంలో ఎక్కడైనా చెరువు గట్టులు తెగిపోతే అది వార్త అవుతుంది. కానీ మిషన్ కాకతీయతో రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు నిర్మిస్తే అది వార్తలలో రాదు. వాటితో భూగర్భజలాలు పెరిగితే అది వార్త కాదు. ఎక్కడైన బోరుబావులు ఎండిపోతే వార్త వస్తుంది! 

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే హెలికాఫ్టర్‌ క్యాబిన్లను హైదరాబాద్‌లో తయారవుతున్నాయని గర్వంగా ఎందుకు చెప్పుకోలేకపోతున్నాము. హైదరాబాద్‌లో ఎక్కడైన చెట్లు పడిపోయినా, మురుగు కాల్వలు పొంగి ప్రవహించిన వార్తలలో కవర్ చేస్తారు. కానీ హైదరాబాద్‌లో పచ్చదనం గణనీయంగా పెరిగిందనే విషయం గురించి ఎప్పుడైనా హైలైట్ చేసి వ్రాశారా?

నిజానికి మునిసిపల్ సిబ్బందిది ‘థాంక్స్ లెస్ జాబ్‌.’ వారు కరోనా సమయంలో, భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఎంతగా శ్రమిస్తారో ఎవరూ పట్టించుకోరు... ఏనాడూ వారి కష్టాన్ని ఎవరూ గుర్తించరు... మెచ్చుకోరు. 

పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, హరితహారం వంటి అద్భుతమైన కార్యక్రమాలు రాష్ట్రంలో అమలవుతున్నాయి. పాలు, మాంసం, చేపలు, కోళ్ళు ఉత్పత్తులలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి సాధించింది. కానీ వాటి గురించి ఎన్నడూ ఏ మీడియా ప్రాధాన్యత ఇస్తూ వ్రాయదు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అభివృద్ధి గురించి చెప్పుకోవడానికి ఇబ్బంది ఏమిటి?  

ఇప్పుడు వార్తలను వార్తలుగా వ్రాయడం లేదు. కొందరి వ్యక్తుల లేదా మీడియా యాజమాన్యాల అభిప్రాయాలే వార్తలుగా చలామణి అవుతున్నాయి.  రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు లేదా సంక్షేమ పధకాల గురించి వార్తలు వ్రాయడానికి ఎవరికీ మనసొప్పదు కానీ నెగెటివ్ వార్తలను మాత్రం హైలైట్ చేసి మరీ ప్రచురిస్తుంటారు. ఎందుకు?అభివృద్ధి లేదా సంక్షేమ పధకాల గురించి వార్తలు వ్రాయడానికి ఏమిటి కష్టం?” అని మంత్రి కేటీఆర్‌ మీడియాకి మంత్రి కేటీఆర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. నిజమే కదా?


Related Post