ఈరోజు ఉదయం విశాఖలో పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ అక్కడి జగన్ ప్రభుత్వాన్ని పల్లెత్తుమాట అనలేదు. కానీ హైదరాబాద్‌లో అడుగుపెడుతూనే కేసీఆర్ ప్రభుత్వంపై ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బేగంపేట విమానాశ్రయం వద్ద బిజెపి శ్రేణులని ఉద్దేశ్యించి ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తూ, “తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో మనం కూడా భాగస్వాములవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలో హైదరాబాద్ నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రంగా నిలుస్తోంది. తెలంగాణలో బిజెపి క్రమంగా బలపడుతోంది. మునుగోడు ఉపఎన్నికలలో మన పార్టీ శ్రేణులు చేసిన కృషిని ఎన్నటికీ మరిచిపోలేను. ఒక్క మునుగోడు ఉపఎన్నికల కోసం యావత్ తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గానికి కదిలి వచ్చి అక్కడే మకాం వేసిందంటే అది మన శక్తిసామర్ధ్యాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కష్టకాలంలో కూడా ప్రజలు బిజెపిని విడిచిపెట్టలేదనే కొత్త విషయం మునుగోడు ఉపఎన్నికలలో తెలిసింది.
రాష్ట్రంలో కుటుంబపాలన అంతమయ్యే రోజు దగ్గరలోనే ఉంది. కొంతమంది నన్ను బూతులు తిడుతున్నారు. నన్ను తిట్టినా పర్వాలేదు కానీ తెలంగాణ ప్రజల జోలికివస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను. తెలంగాణలో ఓ అవినీతి ప్రభుత్వంపై మీరు చేస్తున్న పోరాటం తప్పక ఫలిస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికైతే కొందరు అవినీతిపరులు తమ జేబులు నింపుకొంటున్నారు.
తెలంగాణలో రాష్ట్రంలో ప్రతిభావంతులకు కొదవలేదు కానీ వారందరూ అణచివేతకు గురవుతున్నారు. బడుగు బలహీనవర్గాల ప్రజలు దోపిడీకి గురవుతున్నారు. ఈ చీకట్లు తొలగిపోయే రోజు దగ్గర్లోనే ఉంది. చుట్టూ చీకట్లు కమ్ముకొన్నప్పుడే కమలం వికసించడం మొదలుపెడుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావడం ఖాయం. అంతవరకు బిజెపి కార్యకర్తలు వెనుకంజ వేయకుండా అలుపెరుగని పోరాటం చేయాలి. అప్పుడే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలుగుతాము,” అని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు.
నిజానికి ప్రధాని నరేంద్రమోడీ ఈ మాటలు ఏపీలో పర్యటించినప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని ఉద్దేశ్యించి చెప్పి ఉండాలి. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఆ రాష్ట్రంలో రాజకీయాలు, కక్ష సాధింపులు, అప్పులు, అవినీతి, అరాచకాలే తప్ప అభివృద్ధి జరగడం లేదు. కానీ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి వీరవిధేయంగా ఉంటూ, ఆయనకు ఘనంగా స్వాగతం, వీడ్కోలు పలికారు. ఈరోజు విశాఖలో జరిగిన మోడీ సభకు అన్ని ఏర్పాట్లు జగన్ ప్రభుత్వమే చేసింది. లక్షమందిని జనసమీకరణ చేసి మోడీకి జేజేలు పలికించింది. కనుక ఏపీలో ఎంత అరాచక పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ ఒక్క తప్పు ఎంచలేదు. కానీ ఇక్కడ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉందంటూనే అందుకు కారణమైన సిఎం కేసీఆర్ మీద తీవ్రస్థాయిలో ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. సిఎం కేసీఆర్ తనను గద్దె దించడానికి బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తుండటమే ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది.