తెలంగాణలో మరో ఐఏఎస్‌ అధికారి... మరో కొత్త పార్టీ!

November 11, 2022


img

తెలంగాణలో ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయని తెలిసి ఉన్నా కూడా ఇంకా కొత్త పార్టీలు పుట్టుకొస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదీ... ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారులు రాజకీయాలలోకి రావాలనుకోవడం ఇంకా విశేషం. తెలంగాణ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ తన పదవికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మాజీ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి త్వరలో రాజకీయ పార్టీ స్థాపించడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. 

ఆకునూరి మురళి ఇదివరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత తన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, ఏపీలో జగన్ ప్రభుత్వానికి సలహాదారుగా కొంతకాలం పనిచేశారు. అక్కడ ఇమడలేక ఆ పదవికి రాజీనామా చేసి తెలంగాణ తిరిగివచ్చి రాజకీయాలలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.  

శుక్రవారం కొత్తగూడెంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో రాజకీయాలు, ఎన్నికలను టిఆర్ఎస్‌, బిజెపిలు కలిసి ఓ వ్యాపారంగా మార్చేశాయి. మునుగోడు ఉపఎన్నికలలో ఆ రెండు పార్టీలు ఏవిదంగా డబ్బు ఖర్చుచేశాయో... ఏవిదంగా మద్యం ఎరులై పారించాయో అందరూ చూశారు. ఇటువంటి ఈ పద్దతులను వదిలించకపోతే అది ప్రజాస్వామ్యాన్ని కోలుకోలేని విదంగా దెబ్బ తీస్తుంది. రాజకీయాలలో నైతిక విలువలు, హుందాతనం మళ్ళీ తెచ్చేందుకు మేధావులు, మాజీ అధికారులతో కలిసి త్వరలోనే ఓ కొత్త పార్టీ స్థాపించబోతున్నాను. దీనికి సంబందించి పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తాను,” అని చెప్పారు.            

ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ బహుజనులకు రాజ్యాధికారం కల్పిస్తానని చెపుతూ వారిలో చైతన్యం తీసుకురావడానికి గత ఏడాదిన్నరగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అందరినీ ఒకేతాటిపైకి తీసుకువచ్చేందుకు చాలా కృషి చేశారు. కాస్త నమ్మకం కలగడంతో మునుగోడు ఉపఎన్నికలలో బీసీ అభ్యర్ధిని నిలబెట్టారు. కానీ మునుగోడులో బీసీలు మాత్రం ప్రలోభాలకు లొంగిపోయి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన టిఆర్ఎస్‌ అభ్యర్ధికే ఓట్లు వేసి గెలిపిచ్చారు తప్ప తమ వర్గానికి చెందిన అభ్యర్ధిని పట్టించుకోలేదు. 

కనుక ఎన్నికలు లేని సాధారణ సమయాలలో ప్రజలు సభలు, సమావేశాలకు వచ్చి చప్పట్లు కొట్టినా ఎన్నికలప్పుడు ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే ఓట్లు వేస్తారని మునుగోడు ఉపఎన్నికలలో మరోసారి నిరూపించబడింది. కనుక ఈ ఆశయాలు, ఆదర్శాలు ఎన్నికలలో పనిచేయవని, ఎన్నికలలో టిఆర్ఎస్‌, బిజెపిలతో పోటాపోటీగా తాము డబ్బు ఖర్చు చేయగలిగితేనే రాజకీయాలలోకి రావడం మంచిదని కొత్త పార్టీలు పెట్టుకొనేవారు గ్రహిస్తే నష్టపోకుండా ఉంటారు. లేదంటే మునుగోడు ఉపఎన్నికలలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌లాగే చేతులు కాల్చుకోక తప్పదు. ఇదే చేదు వాస్తవం. నమ్మినా నమ్మకపోయినా సరే!


Related Post