మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సుమారు 400 కార్లతో భారీ ర్యాలీగా ములుగు జిల్లా వాజేడుకి వెళ్ళి అక్కడ తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు. గత ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి ఆయనను సిఎం కేసీఆర్ పట్టించుకోకుండా పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. కనుక పార్టీ మారేందుకే నిన్న తన అనుచరులతో చర్చించుకొనేందుకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారని అర్దమవుతూనే ఉంది.
కనుక ఆ సమావేశం తర్వాత తుమ్మల టిఆర్ఎస్‌కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తారని లేదా కేసీఆర్‌ని విమర్శించవచ్చని అందరూ భావించారు. కానీ ఆయన అటువంటిదేమీ చేయకుండా గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనేదే తన చిరకాల కోరిక అని, సీతారామ ప్రాజెక్టు కోసమే కేసీఆర్‌తో కలిసి పనిచేస్తానని చెప్పారు. వాజేడు వద్ద గోదావరి నదిపై వంతెన నిర్మించిన తర్వాత వాజేడు చాలా అభివృద్ధి చెందిందని తుమ్మల అన్నారు.
గోదావరితో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావాలనే విషయం చెప్పడం కోసం తుమ్మల 400 కార్లు వేసుకొని వాజేడు వెళ్ళి తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాల్సిన అవసరమే లేదు. కానీ ఎందుకు వెళ్ళారంటే బహుశః సిఎం కేసీఆర్‌కు తొలి సంకేతం పంపేందుకే కావచ్చు. నేటికీ తాను టిఆర్ఎస్‌లోనే కొనసాగాలనుకొంటున్నానని కనుక కేసీఆర్ ఈవిషయం గుర్తించి తగురీతిలో స్పందించాలని, లేకుంటే పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నానని తుమ్మల కేసీఆర్ సంకేతం పంపినట్లు అర్దమవుతోంది.
కానీ బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేసుకొంటూ బిజీగా ఉన్న కేసీఆర్ ఏవిదంగా స్పందిస్తారో... ఎప్పుడు స్పందిస్తారో... అసలు స్పందిస్తారో లేదో... చూడాలి. లేకుంటే తుమ్మల బిజెపిలో చేరుతారా కాంగ్రెస్ పార్టీలో చేరుతారా? అనేదే ప్రశ్న.