సుమారు ఏడాదిన్నరగా సిఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కి వెళ్ళడం మానుకొన్నారు. కేసీఆర్ గవర్నర్‌పై యుద్ధం ప్రకటించారు కనుక మంత్రులు, ప్రభుత్వంలో అధికారులు అందరూ కూడా గవర్నర్‌కు దూరంగా ఉండక తప్పడంలేదు. ఈ కారణంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్ నుంచి అడుగు బయటపెట్టిన ప్రతీసారి ప్రోటోకాల్ మర్యాదలు లభించక అవమానాలు ఎదుర్కోక తప్పడం లేదు. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించి పంపిన బిల్లులను ఆమె ఆమోద ముద్ర వేయకుండా పక్కన పెట్టేశారు. దీంతో ప్రభుత్వానికి వాటిని అమలుచేయలేని పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మద్య ఈ ప్రతిష్టంభన కొనసాగుతుండగా తెలంగాణలో యూనివర్సిటీల ఉమ్మడి నియామక బిల్లుపై వివరణ ఇచ్చేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్‌భవన్‌కు రావలసిందిగా కోరుతూ గవర్నర్ వ్రాసిన లేఖ ప్రభుత్వాన్ని ఒడ్డున పడేసినట్లయింది. ఇంకా బెట్టు చేస్తే గవర్నర్ వద్ద బిల్లులకి ఎన్నటికీ మోక్షం లభించవని గుర్తించిన సిఎం కేసీఆర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్‌భవన్ వెళ్ళేందుకు అనుమతించినట్లు భావించవచ్చు. దీంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అహం సంతృప్తి చెంది బిల్లులకు ఆమోదముద్ర వేస్తారని సిఎం కేసీఆర్ భావించి ఉండవచ్చు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సాంకేతిక విద్యా కమీషనర్ నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణా, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిలను వెంటబెట్టుకొని గురువారం సాయంత్రం రాజ్‌భవన్ వెళ్ళి గవర్నర్‌ని కలిసి ఉమ్మడి నియామక బోర్డుపై గవర్నర్ సందేహాలన్నిటికీ వివరణ ఇచ్చారు. వారి సమావేశం సానుకూలంగా ముగిసినట్లు తెలుస్తోంది.
కనుక ఇది ఓవిదంగా రాజీ ప్రయత్నమే అని చెప్పవచ్చు. మంత్రి, అధికారులు వచ్చి వివరణ ఇవ్వడంతో గవర్నర్ సంతృప్తి చెందారు కనుక ఈ బిల్లుకి ఆమోదముద్ర వేయడం ఖాయంగానే కనిస్తోంది. కానీ మిగిలిన 7 బిల్లులకు కూడా గవర్నర్ ఆమోదముద్ర వేస్తారా లేక టిఆర్ఎస్ మంత్రులు రియాక్షన్ చూసిన తర్వాత నిర్ణయం తీసుకొంటారా?చూడాలి.