టిఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి తెలంగాణలో అధికారం చేపట్టినప్పుడు మంత్రిగా ఓ వెలుగువెలిగిన అనేకమందిని తర్వాత కేసీఆర్ పట్టించుకోవడం మానేశారు. పార్టీలో కూడా వారికి ప్రాధాన్యత లేకుండా పోయింది. వారిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా ఒకరు. 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు ఎన్నికలలో ఆయన ఓడిపోయినప్పటి నుంచి ప్రభుత్వంలో, పార్టీలో ఆయనను పట్టించుకొనేవారే లేరు. అయినప్పటికీ ఇంతకాలం తుమ్మల మౌనంగా ఉంటూ చాలా సంయమనం పాటిస్తూనే ఉన్నారు. కానీ సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ ఆయనని పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
కనుక పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. ఆయనకు కాంగ్రెస్, బిజెపి రెండూ ఆహ్వానం పలుకుతున్నాయి. కనుక ఈవిషయంపై చర్చించడానికే బహుశః ఈరోజు ఆయన భద్రాచలంలో తన అనుచరులతో ఆత్మీయ సమావేశం కాబోతున్నారు. ఈరోజు ఉదయం 400 కార్లతో భారీ ఊరేగింపుగా తుమ్మల అనుచరులతో కలిసి ఖమ్మం నుంచి భారీ ఊరేగింపుగా భద్రాచలం బయలుదేరారు. ఖమ్మం జిల్లాలోని ఆయన అనుచరులందరూ ఈ సమావేశానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. అయితే నియోజకవర్గం అభివృద్ధి గురించి చర్చించడానికే తాము సమావేశమవుతున్నామని ఆయన అనుచరులు చెప్పుతున్నారు.
వచ్చే ఎన్నికలలో కూడా పోటీ ప్రధానంగా టిఆర్ఎస్, బిజెపి మద్యే ఉంటుంది. బిజెపికి కూడా ఆయన వంటి బలమైన అభ్యర్ధి అవసరం కనుక తప్పకుండా స్వాగతించి ఆయనకే టికెట్ ఇస్తుంది. ఒకవేళ ఆ ఎన్నికలలో బిజెపి గెలిస్తే తుమ్మలకి మళ్ళీ పూర్వవైభవం లభిస్తుంది. కనుక ఆయన బిజెపివైపే మొగ్గు చూపవచ్చు.
ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకొంటే ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి వంటి సీనియర్ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. అదీగాక ప్రతీ ఎన్నికతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారిపోతోంది. కనుక వచ్చే ఎన్నికలలో గెలుస్తుందనే నమ్మకం కూడా లేదు. కనుక తుమ్మల సొంత బలంతో వచ్చే ఎన్నికలలో నెగ్గినా ఎమ్మెల్యేగానే మిగిలిపోవచ్చు. కనుక ఈ అంశాలన్నిటినీ నేటి ఆత్మీయ సమావేశంలో చర్చించి బేరీజు వేసుకొని ఏ పార్టీలో చేరాలనే నిర్ణయం తీసుకోవచ్చు. ఈ సమావేశంతో తుమ్మల కేసీఆర్‌కు తొలి సంకేతం పంపారు కనుక ఆయన పిలుపు కోసం ఎదురుచూస్తారా లేక తక్షణమే పార్టీ మారుతున్నట్లు ప్రకటిస్తారా? అనేది ఈరోజే తేలిపోవచ్చు.