తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుదవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరోసారి రాష్ట్ర ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఫామ్‌హౌస్ ఫైల్స్ కేసులో రాజ్‌భవన్ (తన)కి కూడా సంబంధం ఉందన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మీడియాకు లీకులు ఇవ్వడాన్ని ఆమె తప్పు పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఫోన్‌ని కూడా టాపింగ్ చేస్తోందేమో అని గవర్నర్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నెలరోజుల క్రితం కొన్ని బిల్లులు ఆమోదం కోసం పంపించి ఏడు నెలల క్రితం పంపించామని, వాటిని తాను తొక్కిపట్టానని దుష్ప్రచారం చేయడం తగదని గవర్నర్ తమిళిసై అన్నారు.
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలలో వీసిలను, భోధనా సిబ్బందిని భర్తీ చేయాలని తాను ఏడేళ్ళుగా చెపుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు తన వద్దకు ఉమ్మడి నియామక మండలి బిల్లు పంపించి, నా వల్లనే ఉద్యోగాలు భర్తీ ఆలస్యం అవుతోందంటూ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధి సంఘాలు రాజ్‌భవన్‌ను మట్టడి వెనుక ఎవరున్నారో నాకు తెలుసని గవర్నర్ అన్నారు. ప్రగతి భవన్‌లోకి ఎవరికీ ప్రవేశం లభించదేమో కానీ రాజ్‌భవన్ తలుపులు అందరి కోసం ఎల్లప్పుడూ తెరుచుకొనే ఉంటాయన్నారు. ఒకవేళ రాజ్‌భవన్ ముట్టడికి విద్యార్ధి సంఘాలు వస్తే వారితో కూడా తాను చర్చించడానికి సిద్దమని గవర్నర్ తెలిపారు.
ప్రభుత్వం పంపిన బిల్లులలో మొట్టమొదట ఉమ్మడి నియామక మండలి బిల్లునే పరిశీలించి, దానిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ కోరానని గవర్నర్ తెలిపారు. ప్రభుత్వం రాజ్‌భవన్ పట్ల చాలా అవమానకరంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రోటోకాల్ పాటించకపోవడమే కాకుండా తనను ఉద్దేశ్యించి టిఆర్ఎస్ మంత్రులు అనుచితంగా మాట్లాడుతున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు.