తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మద్య జరుగుతున్న యుద్ధంలో మరో అధ్యాయం మూడు రోజుల క్రితం మొదలైంది. గత శాసనసభ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం 9 బిల్లులను ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్ సంతకం చేయకుండా పక్కనపెట్టడంతో ఇది మళ్ళీ మొదలైంది.
వాటన్నిటిపై గవర్నర్ వివరణ కోరగా ప్రభుత్వం స్పందించకపోవడంతో వాటిని పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే వాటిలో తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు, తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులపై వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా రాజ్‌భవన్‌కి వచ్చి తనను కలవాలని ఆదేశిస్తూ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ వ్రాశారు. రాజ్‌భవన్ గడప తొక్కరాదని పట్టుదలగా ఉన్న సిఎం కేసీఆర్‌కు ఇది సవాల్ విసరడమే అని చెప్పవచ్చు.
కనుక మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్‌భవన్‌కి పంపిస్తారా లేదా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ్ళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “గవర్నర్ లేఖ మాకు అందింది. నేను ఆమెను కలిసి వివరణ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాను. ఆమె అపాయింట్ ఇస్తే వెంటనే వెళ్ళి కలిసి ఆమె సందేహాలన్నీ నివృత్తి చేస్తాను,” అని చెప్పారు.
ఇది మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో ప్రెస్‌మీట్‌కి రావలసిందిగా మీడియాను ఆహ్వానించడంతో ఆమె దేని గురించి మాట్లాడబోతున్నారో? కేసీఆర్‌పై ఆమె ఏం విమర్శలు చేస్తారో? ఏం బాంబులు పేల్చబోతున్నారో? ఆమె మాటలపై సిఎం కేసీఆర్ ఏవిదంగా స్పందిస్తారో?మంత్రి సబితా ఇంద్రారెడ్డిని రాజ్‌భవన్‌కు పంపించే విషయంలో మనసుమార్చుకొని ఎదురుదాడి చేయిస్తారా?అనే సందేహాలకు రేపటిలోగా సమాధానాలు లభించవచ్చు.