కేసీఆర్‌ గుప్పెట్లో కమ్యూనిస్టులు... శభాష్... శభాష్!

November 08, 2022


img

ఒకప్పుడు దొరలకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టులు ఇప్పుడు అదే దొర ముందు వినయంగా చేతులు కట్టుకొని నిలబడి, ఆయన మనసులో మాటలను చిలకల్లా వల్లెవేస్తుండటం చూస్తున్నవారికి వీరు కమ్యూయిస్టులేనా?అనే అనుమానం కలుగుతుంది. మునుగోడు ఉపఎన్నికలకు ముందు టిఆర్ఎస్‌-వామపక్షాల మద్య పొత్తులు కుదిరాయి. ఎందుకంటే దేశంలో కేసీఆర్‌ ఒక్కరే ధైర్యంగా ప్రధాని నరేంద్రమోడీని, బిజెపిని ఎదిరించి పోరాడుతున్నారనట! అయితే తామే ఎందుకు పోరాడలేము? అని వామపక్ష నేతలు ఆలోచించకపోవడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

కారణాలు, కుంటిసాకులు ఏవైనప్పటికీ టిఆర్ఎస్‌కి తోక పార్టీగా మారేందుకు వామపక్ష నేతలు సిద్దపడ్డారు కనుక ఇప్పుడు వారు కూడా టిఆర్ఎస్‌ నేతల్లాగే మాట్లాడుతున్నారు. ఈనెల 12న ప్రధాని నరేంద్రమోడీ రామగుండం పర్యటనపై టిఆర్ఎస్‌ నేతలు ఏం మాట్లాడారో, సరిగ్గా అవే మాటలు కొత్తగా తెలంగాణ సీపీఐ పగ్గాలు చేపట్టిన కూనంనేని సాంబశివరావు పలుకుతుండటమే ఇందుకు తాజా ఉదాహరణ. 

 కూనంనేని హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు. ఈ 8 ఏళ్లలో మోడీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం తదితర విభజన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోడీని టిఆర్ఎస్‌తో కలిసి అడ్డుకొని నిరసనలు తెలియజేస్తాం. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బిజెపి నాయకురాలిలా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రం నుంచి ఆమెను తొలగించాలని కోరుతూ త్వరలో రాజ్‌భవన్‌ను ముట్టడిస్తాం. సింగరేణి బొగ్గు గనుల అమ్మకాలని వ్యతిరేకిస్తూ ఈనెల 10వ తేదీ నుంచి ఆందోళనలు చేపడతాం,” అని అన్నారు           

సిఎం కేసీఆర్‌ తమ భుజలపై తుపాకీ ఉంచి ప్రధాని నరేంద్రమోడీని ఎదుర్కోవాలని ప్రయత్నిస్తున్నారని గ్రహించలేనంత అమాయకులు ఏం కారు వామపక్ష నేతలు. అయినా ఎందుకో కేసీఆర్‌కి లొంగిపోయారని అర్దమవుతోంది. రాష్ట్రంలో, దేశంలో ఇక ఎన్నటికీ తాము అధికారంలోకి రాలేమనే చేదు నిజాన్ని వామపక్షాలు బాగానే గ్రహించినట్లున్నాయి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే ప్రయత్నంలో తమకి ‘పొత్తుల ఆఫర్’ ఇచ్చిన కేసీఆర్‌ చెయ్యి పట్టుకొని, ఎర్రకండువాలు కప్పుకొని టిఆర్ఎస్‌ భాషలో మాట్లాడుతున్నట్లున్నారు. ఇప్పటికే అనేక పార్టీల వెనుక తిరిగిన వామపక్షాలు కనీసం ఇప్పుడైనా కేసీఆర్‌ చెయ్యి వదలకుండా నడిస్తే వారి భవిష్యత్‌కి ఢోకా ఉండదు. 


Related Post