టిఆర్ఎస్ పార్టీ పేరును బిఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా మార్చుతున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పేరిట టిఆర్ఎస్ ఈరోజు మీడియాకు ఓ ప్రకటన జారీ చేసింది. పార్టీ పేరు మార్పుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే నేటి నుండి 30 రోజులలోగా కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పంపించాలని ఆ ప్రకటనలో కోరింది. కేంద్ర ఎన్నికల కమీషన్ నిబందనల ప్రకారం పార్టీ పేరు మార్పుపై పత్రికలలో ప్రకటనలు ఇచ్చి ప్రజలకు ముందుగా తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ఆంగ్ల పత్రికలో కూడా ప్రకటన ఈయవలసి ఉంటుంది. నెలరోజులలోగా ఎటువంటి అభ్యంతరాలు రానట్లయితే అప్పుడు కేంద్ర ఎన్నికల కమీషన్ టిఆర్ఎస్ పేరు మార్పుకి సంబందించిన మిగిలిన ప్రక్రియను పూర్తిచేసి ఆమోదముద్ర వేస్తుంది. కనుక అభ్యంతరాలు రాకుంటే ఈసీ ఆమోదముద్ర వేయడం లాంఛనప్రాయమే అని భావించవచ్చు.
అయితే ప్రస్తుతం టిఆర్ఎస్ చేతిలో బిజెపి వరుసగా రెండు ఎదురు దెబ్బలు (ఫామ్‌హౌస్ వ్యవహారం, మునుగోడు ఉపఎన్నికలు) తిని ఉంది కనుక అది ఎవరిచేతైనా అభ్యంతరాలు నమోదు చేయించవచ్చు. అదే కనుక జరిగితే టిఆర్ఎస్ పేరు మార్పుకి మరికొంత సమయం పట్టవచ్చు. అయితే డిసెంబర్ 5,12 తేదీలలో గుజరాత్ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ జరుగబోతోంది కనుక ఆలోగా ఈ ప్రక్రియ పూర్తికాకపోవచ్చు కనుక వాటిలో బిఆర్ఎస్ పాల్గొనే అవకాశం లేదు. కానీ గుజరాత్ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఆమాద్మీపార్టీకి మద్దతుగా సిఎం కేసీఆర్ ప్రచారం చేసే అవకాశం ఉంది.