తెలంగాణ ప్రభుత్వంలో ఐపిఎస్ పదవికి ఆరేళ్ళ ముందుగానే రాజీనామా చేసి బీఎస్పీలో చేరిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, గత 10-12 నెలలుగా రాష్ట్రమంతటా పర్యటిస్తూ బడుగుబలహీనవర్గాలను చైతన్యపరిచి అందరికీ ఒక్క తాటిపైకి తెచ్చి రాష్ట్రంలో ఒక రాజకీయ శక్తిగా మార్చేందుకు చాలా కృషి చేశారు. తన ప్రయత్నాలు ఫలించాయని భావించారో ఏమో మునుగోడు ఉపఎన్నికలలో బిఎస్పీ అభ్యర్ధిని నిలబెట్టారు.
మునుగోడులో బీసీల సంఖ్య ఎక్కువైనప్పటికీ టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెడ్డి సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధులను బరిలో దించితే ప్రవీణ్ కుమార్ మాత్రం నిబద్దత చాటుకొంటూ బీసీ అభ్యర్ధి ఆందోజు శంకర్ ఆచారినే నిలబెట్టారు. కనుక బీసీలు తప్పకుండా ఆయనకే ఓట్లు వేస్తారని ఆశించడం అత్యాశకాదు. కానీ సుమారు రెండున్నర లక్షల మంది ఓటర్లలో ఆయనకి కేవలం 4,146 మంది మాత్రమే ఓట్లు వేశారు.
ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్, బిజెపిలు వందల కోట్లు ఖర్చు పెట్టాయి. మద్యం ఎరులై పారించాయి. వామపక్షాలు టిఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ బిజెపి, కాంగ్రెస్ పార్టీల మద్య చీలిపోయింది. కనుక మేము గెలవలేకపోయామని ప్రవీణ్ కుమార్ సమర్ధించుకొన్నారు. అయితే ప్రతీ ఎన్నికలలో ఇలాగే జరుగుతుంటాయి కదా? ఇటువంటి పరిస్థితులలోనే వాటిని ఎదుర్కొని గెలవాల్సి ఉంటుందని ప్రవీణ్ కుమార్ గ్రహించలేదా?అనే సందేహం కలుగుతుంది.
ఎన్నికలు లేని సాధారణ సమయాలలో ఆయన చేసే ప్రసంగాలకు చాలా మంది తరలివస్తారు. చప్పట్లు కొడతారు. కానీ ఎన్నికలలో ‘ఓటుకి నోటే’ చెల్లుతుందనే నగ్న సత్యాన్ని ప్రవీణ్ కుమార్ మునుగోడులో గ్రహించే ఉండాలి. ఒకనాడు దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వామపక్షాలే ఇప్పుడు ‘దొరతో’ ఒప్పందం చేసుకొని వర్తమాన రాజకీయాలకు తగ్గట్లుగా మారిపోయినప్పుడు, మేధావిగా పేరున్న ప్రవీణ్ కుమార్ వాస్తవ పరిస్థితులను ఆకళింపుజేసుకోవడంలో విఫలమయ్యారా?అనే సందేహం కలుగుతుంది.
వచ్చే ఎన్నికలనాటికి బీఎస్పీని బలోపేతం చేసుకొని ఈ మూడు పార్టీలతో పోరాడి విజయం సాధిస్తామని, రాష్ట్రంలో తప్పకుండా అధికారంలోకి వస్తామని పవన్ కుమార్ పడికట్టు పదాలతో సమర్ధించుకొన్నప్పటికీ, వచ్చే ఎన్నికలు టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మూడింటికీ చాలా కీలకం కనుక అప్పుడు అవి ఇంకా భారీగా డబ్బు వెదజల్లుతాయి. మరి అప్పుడు వాటిని ఎలా ఎదుర్కోగలరు?కనుక ప్రవీణ్ కుమార్ మునుగోడు ఉపఎన్నికల నుంచి ఏమైనా నేర్చుకొని ఉంటే, వచ్చే ఎన్నికలలో బీఎస్పీ ఏవిదంగా ముందుకు వెళ్ళాలో ఇప్పటి నుంచే ఆలోచించుకోవడం చాలా అవసరం!