మోడీ ఆరాటం ఆ క్రెడిట్ కోసమేనా?

October 19, 2016


img

భారత్ ఆర్మీ పాక్ భూభాగంలోకి చొరబడి సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించినపుడు, పాక్ పత్రికలు దానిని రాజకీయ కోణంలో నుంచి చూశాయి. వచ్చే ఏడాది భారత్ లో కొన్ని రాష్ట్రాలలో జరుగబోతున్న ఎన్నికలు మోడీ ప్రభుత్వానికి చాలా కీలకమైనవి కనుక సర్జికల్ స్ట్రయిక్స్ గురించి గట్టిగా ప్రచారం చేసుకొని ఆ ఎన్నికలలో లాభపడాలని ఆశిస్తోందని పాక్ మీడియా  ముక్తకంఠంతో వాదించింది. సర్జికల్ స్ట్రయిక్స్ జరిపినందుకు అంతవరకు ప్రధాని నరేంద్ర మోడీని మెచ్చుకొంటున్న కాంగ్రెస్, ఆమాద్మీ, తదితర పార్టీలకి జ్ఞానోదయం అయినట్లు అవి కూడా ఆ కోణంలో నుంచే మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి.

అప్పుడు మోడీ ప్రభుత్వం మౌనం వహించింది. ప్రతిపక్షాల విమర్శలని ఖండించే ప్రయత్నం చేయలేదు. అది చాలా వ్యూహాత్మక మౌనమేనని అర్ధం కావడానికి ప్రతిపక్షాలకి కొంత సమయం పట్టింది. సర్జికల్ స్ట్రయిక్స్ గురించి అవి అనుమానాలు వ్యక్తం చేస్తూ, వాటికి ఆధారాలు కావాలని డిమాండ్ చేస్తూ మోడీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పడంతో వాటి నోళ్ళు మూతపడ్డాయి. ఆ విధంగా తన తరపున దేశప్రజలు ప్రతిపక్షాలతో పోరాడేలాగ చేయడంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తన తెలివితేటలు బయటపెట్టుకొన్నారు. 

అప్పుడు సర్జికల్ స్ట్రయిక్స్ గురించి ప్రతిపక్షాలు ఎక్కువగా మాట్లాడితే మోడీ ప్రభుత్వం మౌనంగా ఉండేది కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు మౌనంగా ఉంటే మోడీ ప్రభుత్వం దాని గురించి ఎక్కువగా మాట్లాడుతుండటం విశేషం. ప్రధాని నరేంద్ర మోడీ లక్నో, హిమాచల్ ప్రదేశ్ పర్యటనలలో ఆ ప్రస్తావన చేయడంతో ఆ క్రెడిట్ తనదేనని ప్రజలకి మరొకసారి గుర్తు చేసినట్లు భావించవలసివస్తోంది. ఇక ముందు కూడా మోడీ, ఆయన ప్రభుత్వంలో మంత్రులు, ఎంపిలు, భాజపా నేతలు సర్జికల్ స్ట్రయిక్స్ గురించి గట్టిగా చెప్పుకొన్నట్లయితే అప్పుడు పాక్ పత్రికల అనుమానమే నిజమని భావించవలసి ఉంటుంది. సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం అత్యవసరమే..100 శాతం నిజమే కానీ వాటి గురించి మోడీ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం మాత్రం సరికాదు. 

అలాగే తన ప్రభుత్వంపై ఏర్పడిన మతతత్వ ముద్రని తొలగించుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నించకపోగా అయోధ్యలో రామాయణ మ్యూజియం నిర్మాణం గురించి ఆలోచనలు చేయడం కూడా అనవసరమే. 

యూపి ఎన్నికలు భాజపాకి చాలా కీలకమైనవే కావచ్చు కానీ దాని కోసం మోడీ ప్రభుత్వం మళ్ళీ రాముడిని ఆశ్రయించనవసరం లేదు. ఆశ్రయిస్తే ఇక భాజపా ఎప్పటికీ సెక్యులర్ ముద్ర సంపాదించుకోలేదు. పైగా ఎన్నికలు వచ్చినప్పుడల్లా మతాన్ని ఆశ్రయిస్తుందనే అప్రదిష్ట కూడా మూటగట్టుకోవలసి వస్తుంది.

కనుక దేశాభివృద్ధి కోసం తన ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి చెప్పుకొని ప్రజలని ఓట్లు కోరడమే ప్రధాని నరేంద్ర మోడీకి చాలా గౌరవంగా, హుందాగా ఉంటుంది. ఒకవేళ అభివృద్ధి నినాదంతో యూపి ఎన్నికలలో భాజపా విజయం సాధించినట్లయితే, మోడీ ప్రభుత్వానికి నిజంగానే ప్రజామోదం ఉన్నట్లు రుజువు అవుతుంది కనుక మున్ముందు జరుగబోయే ఎన్నికలలో కూడా అది కలిసి రావచ్చు. 


Related Post