మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఈ ఉపఎన్నికలు అన్ని పార్టీలకు చక్కటి గుణపాఠాలు నేర్పాయని చెప్పవచ్చు. టిఆర్ఎస్ సాధించింది విజయమే కానీ ఘన విజయం మాత్రం కాదు. కేవలం ఏడాది పదవీ కాలం మాత్రమే ఉండే ఈ ఎమ్మెల్యే సీటు గెలుచుకోవడానికి టిఆర్ఎస్ వందల కోట్లు ఖర్చు చేసినా 10,309 ఓట్ల మెజార్టీతో గెలవడం సంబురాలు చేసుకోవలసినంత గొప్ప విషయం కాదనే చెప్పాలి.
ఇక బిజెపి విషయానికి వస్తే, కోమటిరెడ్డి సోదరులకు నల్గొండ జిల్లా, మునుగోడుపై మంచి పట్టుంది కనుక కాంగ్రెస్ ఓట్లన్నీ గంపగుత్తగా తమకే పడిపోతాయనే గుడ్డి నమ్మకంతోనే బిజెపి ఆయన చేత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉపఎన్నికలు తెచ్చిపెట్టుకొని ఓడిపోయి నవ్వులపాలైంది. అంతే కాదు... ఈ తప్పుడు నిర్ణయంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవిని కూడా ఊడగొట్టుకొన్నారు. మునుగోడు కింగ్ అనుకొన్న ఆయన ఇప్పుడు హటాత్తుగా జీరో అయిపోయారు.
ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్, బిజెపిలు వందల కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ, కాంగ్రెస్ నేతలందరూ మునుగోడు ఉపఎన్నికలను పట్టించుకోకుండా రాహుల్ గాంధీ వెంట పరుగులు తీసినప్పటికీ, ఆ కారణంగా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయినప్పటికీ ఒంటరి పోరాటం చేసిన పాల్వాయి స్రవంతి 23,905 సీట్లు గెలుచుకోవడం మామూలు విషయం కాదు.
ఆ ఓట్లు కూడా పడి ఉంటే బిజెపి గెలిచి ఉండేదన్న మాట! బిజెపికి పడిన ఓట్లన్నీ కాంగ్రెస్ ఓట్లే తప్ప అక్కడ బిజెపికి బలం లేదనే విషయం కూడా ఈ ఉపఎన్నికలతో రుజువైంది.
చివరిగా రాజకీయాలలో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవన్న మాట ఈ ఉపఎన్నికలతో మరోసారి నిరూపితమైంది. మునుగోడులో బిజెపికి బలం లేకపోయినా దురాశతో ఉపఎన్నికలను తెచ్చుకొని బిజెపి రాజకీయంగా ఆత్మహత్య చేసుకోగా, ఈ ఉపఎన్నికలలో ఫలితం తారుమారు అయితే తట్టుకోవడం చాలా కష్టమని తెలిసి ఉన్నప్పటికీ కేసీఆర్ కూడా ఉపఎన్నికలకు సై అనడం రాజకీయ ఆత్మహత్య వంటిదే. అయితే తృటిలో తప్పించుకోగలిగారు. అంతే!
టిఆర్ఎస్, బిజెపిల శక్తి సామర్ధ్యాలు తెలిసి ఉన్నప్పటికీ, పార్టీతో కొట్లాడి టికెట్ సాధించుకొని ఈ ఉపఎన్నికల బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతి కూడా రాజకీయంగా ఆత్మహత్య చేసుకొన్నారనే చెప్పవచ్చు. చివరిగా... తమ్ముడికి మద్దతు ఇచ్చి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రాజకీయంగా ఆత్మహత్య చేసుకొన్నారనే చెప్పక తప్పదు.