మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్ విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొంటున్నాయి. మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ, “మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, బిజెపి పెద్దల అహంకారానికి మద్య జరిగిన ఈ ఉపఎన్నికలలో మునుగోడు ఓట్లర్లు ఇచ్చిన తీర్పు ఈ ఉపఎన్నికలను తెచ్చిపెట్టిన ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు చెంపదెబ్బ వంటివి. ఈ ఉపఎన్నికలలో మునుగోడు ప్రజలు అభివృద్ధికి, ఆత్మగౌరవానికే పట్టం కట్టి మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. పార్టీ విజయం కోసం కృషి చేసిన టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. అలాగే మా పార్టీ విజయానికి తోడ్పడిన వామపక్ష నేతలకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ధన్యవాధాలు తెలుపుకొంటున్నాను. ఈ ఉపఎన్నికలలో బిజెపి నేతలు ఎంతగా దిగజారిపోయారంటే చివరికి కౌంటింగ్ సమయంలో ఎన్నికల అధికారికి ఫోన్లు చేసి ఒత్తిడి చేశారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్‌వైపే ఉన్నారనే విషయం ఈ ఉపఎన్నికలతో మరోసారి రుజువైంది.
దుబ్బాక, హుజురాబాద్ ఉపఎన్నికలో వరుస ఓటముల కారణంగా ఈ ఉపఎన్నికలో గెలవడం టిఆర్ఎస్‌కి ముఖ్యంగా... సిఎం కేసీఆర్‌కి తప్పనిసరి అయ్యింది. అలాగే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్నందున ఈ ఉపఎన్నికలో విజయం సాధించడం చాలా అవసరం. కనుకనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించి ఈ ఉపఎన్నికకు సై అని సర్వశక్తులు ఒడ్డి పొరాడి టిఆర్ఎస్‌ను గెలిపించుకొన్నారు. తద్వారా బిజెపి కళ్ళని బిజెపి వేలితోనే పొడుచుకొనేలా చేశారని చెప్పవచ్చు. ఇప్పుడు జాతీయ రాజకీయాలలో ప్రవేశించినప్పుడు ఇదే విషయం అందరికీ చెప్పడం ఖాయం.