ఆ 12మందిపై వేటు పడబోతోందా?

October 19, 2016


img

ఏపి అసెంబ్లీలో సమావేశాలప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని వైకాపా ముప్పతిప్పలు పెడుతుంటుంది. ప్రాజెక్టులలో అవినీతి భాగోతాల గురించి నిలదీస్తుంటుంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు గురించి నిలదీస్తుంటుంది. అలాగే కేంద్రప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా, నిధులు, ప్రాజెక్టులను రాబట్టడంలో విఫలమైనందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుని శాసనసభ సాక్షిగా జగన్ కడిగిపడేస్తుంటారు. 

వైకాపా చాలా మంచి వ్యూహాలనే అమలు చేస్తుంటుంది కానీ దానిలో ఎక్కడో ఒక లోపం తప్పకుండా ఉంటుంది. సరిగ్గా దానినే పట్టుకొని తెదేపా ఎదురుదెబ్బ తీస్తుంటుంది. ప్రత్యేక హోదాకి బదులు కేంద్రప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజిని చంద్రబాబు చాలా ఆనందంగా స్వీకరించినందుకు, అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో వైకాపా తెదేపా సర్కార్ ని గట్టిగా నిలదీసింది. కానీ సభలో మరీ అతిగా ప్రవర్తించి మళ్ళీ తెదేపాకి దొరికిపోయింది. ప్రత్యేక హోదాపై సభలో చర్చ జరపాలని పట్టుబడుతూ వైకాపా ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాద రావుని చుట్టుముట్టి సభా కార్యక్రమాలు జరుగకుండా అడ్డుపడటమే కాకుండా ఆయనతో చాలా అనుచితంగా వ్యవహరించారు. కానీ అప్పుడు ఆయన, తెదేపా ప్రభుత్వం గానీ బయటపడకుండా చాలా సంయమనంగా వ్యవహరించారు. అదే సమయంలో వైకాపా ఎమ్మెల్యేల మాటలని, ప్రవర్తనని అంతా వీడియో చిత్రీకరణ చేయించారు. 

సభని జరుగకుండా అడ్డుపడగలిగామని సంబరపడుతున్న వైకాపాకి తెదేపా ఊహించని షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకి సభా హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆ రోజు సభలో వారు అనుచితంగా ప్రవర్తించినందుకు 25,26 తేదీలలో కమిటీ ముందు హాజరయ్యి సంజాయిషీ చెప్పుకోవాలని కోరుతూ నోటీసులు పంపించింది. ఆ నోటీసులు చూసి వైకాపా లబలబలాడుతోందిప్పుడు. ప్రత్యేక హోదాపై చర్చ జరపాలని కోరినందుకే నోటీసులు పంపిస్తారా? సభలో నిరసన తెలియజేయడం తప్పా? అంటూ సాక్షిలో తన ఆవేదన ఒలకబోసుకొంటోంది. వైకాపా తను చేసిన తప్పులని కప్పి పుచ్చుకొంటూ చాలా తెలివిగా వాదించవచ్చు. కానీ నోటీసులు అందుకొన్న వారందరూ సభలో తమ అనుచిత ప్రవర్తనకి క్షమాపణలు చెప్పుకోక తప్పదు. లేకుంటే అందరిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వైకాపా ఎమ్మెల్యే రోజాపై ఏడాది సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పుడు మరో 12మంది వైకాపా ఎమ్మెల్యేలపై కూడా వేటుపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

ఒకవేళ వారు న్యాయస్థానాలని ఆశ్రయించినా సభలో వారు చేసిన అనుచిత వ్యవహారం అంతా వీడియో రికార్డులో భద్రంగా ఉంది. కనుక అక్కడా వారికి మొట్టికాయాలు పడే అవకాశాలే ఎక్కువ. చంద్రబాబుని ద్వేషించడమే వైకాపా సిద్దాంతంగా మార్చుకొన్న జగన్మోహన్ రెడ్డి అనాలోచిత, దుందుడుకు నిర్ణయాల వలన తరచూ వైకాపా ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. 


Related Post