ప్రస్తుతం తెలంగాణలో సాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు గుర్తింపు లభించకూడదనే దురుదేశ్యంతోనే టిఆర్ఎస్, బిజెపిలు కలిసి టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా ఆడుతున్నాయని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదెలా ఉందంటే ఒకడు ఇల్లు కాలి ఏడుస్తుంటే నా చుట్టకు నిప్పు దొరికిందని మరొకడు సంతోషించినట్లుంది!
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్‌కు అడ్డంగా దొరికిపోయి దానిలో నుంచి ఎలా బయటపడాలా అని బిజెపి నేతలు తలలు పట్టుకొని ఓ పక్క బాధపడుతుంటే, రేవంత్ రెడ్డి ఈవిదంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. రేవంత్ రెడ్డి బాధపడవలసింది భారత్ జోడో యాత్ర గురించి కాదు. మునుగోడు ఉపఎన్నికలలో ఘోరంగా పరాజయం కాబోతున్న తమ కాంగ్రెస్ పార్టీ గురించి. ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీయే విజయం సాధిస్తుందని, రెండు, మూడు స్థానాలలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు నిలుస్తాయని నిన్ననే ఎగ్జిట్ పోల్ జోస్యం చెప్పాయి.
మునుగోడు ఉపఎన్నికల ఎలాగూ కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ రెడ్డికి కూడా ముందే గ్రహించి ఉంటారు. కనుక పార్టీ అభ్యర్ధి ఓటమికి తెర వెనుక పావులు కదిపిన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవడం గురించి ఆలోచిస్తే మంచిది. మునుగోడు ఉపఎన్నికలు కాంగ్రెస్ పార్టీ బలహీనతలను, లోపాలను బయటపెట్టాయి. అలాగే టిఆర్ఎస్, బిజెపిల శక్తిసామర్ధ్యాలు కూడా మరోసారి చూడగలిగారు. కనుక పార్టీని చక్కదిద్దుకొని వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్, బిజెపిలను ఏవిదంగా ఎదుర్కొని విజయం సాధించగలమో ఆలోచిస్తే మంచిది.
ఒకవేళ అది సాధ్యం కాదనుకొంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ గురించి దేశముదురు కాంగ్రెస్ నేతలతో చర్చించి ఏమైనా ప్రత్యామ్నాయ మార్గం కనుక్కోవాల్సి ఉంటుంది. అదీ సాధ్యం కాదనుకొంటే రేవంత్ రెడ్డి తన దారి తాను చూసుకోవడం మంచిది. అంతేకానీ ఇలాంటి మూస రాజకీయాలు, అర్దరహితమైన వాదనలతో మీడియాలో కనబడ్డామనే తృప్తి తప్ప మరే ప్రయోజనం ఉండదు.