జూ.ఎన్టీఆర్‌ని బిజెపి ఇంకా దువ్వుతూనే ఉందా?

October 29, 2022


img

జూ.ఎన్టీఆర్‌కి అరుదైన గౌరవం లభించింది. నవంబర్‌ 1వ తేదీన ‘కన్నడ రాజ్యోత్సవ్’ వేడుకలలో పాల్గొనేందుకు రావలసిందిగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై జూ.ఎన్టీఆర్‌ని ఆహ్వానించారు. కర్ణాటక అసెంబ్లీలో జరుగబోయే ఈ కార్యక్రమంలో ప్రముఖ కన్నడ నటుడు స్వర్గీయ పునీత్ రాజ్‌ కుమార్‌కి మరాణాంతరం కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కర్ణాటక రత్న’ అవార్డును ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వబోతోంది. ఈ అవార్డు ప్రధాన కార్యక్రమంలో పాల్గొనేందుకు రావలసిందిగా ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మై జూ.ఎన్టీఆర్‌ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి జూ.ఎన్టీఆర్‌తో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత కహ్న్ద్రశేఖర్ కంబర్, పునీత్ రాజ్‌ కుమార్‌ కుటుంబ సభ్యులను ఆహ్వానించారు. పునీత్ రాజ్‌ కుమార్‌తో జూ.ఎన్టీఆర్‌కి మంచి స్నేహ సంబంధాలు ఉండేవి కనుక ఆహ్వానిస్తున్నట్లు కర్ణాటక ఎమ్మెల్యేలు తెలిపారు. 

కర్ణాటకలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదివరకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చినప్పుడు జూ.ఎన్టీఆర్‌ని ప్రత్యేకంగా తన వద్దకు పిలిపించుకొని ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా నటించారంటూ అభినందించిన సంగతి తెలిసిందే. అయితే జూ.ఎన్టీఆర్‌ని బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో పనిచేయాల్సిందిగా ఆహ్వానించేందుకు అమిత్‌ షా పిలిపించి ఉండవచ్చని, లేకుంటే ఆర్ఆర్ఆర్‌ నటించిన రామ్ చరణ్‌ని కూడా ఆహ్వానించి ఉండేవారని ఊహాగానాలు వినిపించాయి. వాటిపై జూ.ఎన్టీఆర్‌, బిజెపి స్పందించలేదు కానీ ఇప్పుడు మళ్ళీ బిజెపి ప్రభుత్వం అధ్వర్యంలో జరిగే వేడుకలకు జూ.ఎన్టీఆర్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించడం గమనిస్తే బిజెపి ఆయనను ఇంకా దువ్వుతున్నట్లే ఉంది. కనుక మళ్ళీ దీనిపై రెండు తెలుగు రాష్ట్రాలలో, సోషల్ మీడియాలో కూడా రాజకీయ చర్చలు, వాదోపవాదాలు మొదలయ్యే అవకాశం ఉంది. 


Related Post