గత వారం రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన సిఎం కేసీఆర్ త్వరలోనే హైదరాబాద్ తిరిగివచ్చి మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ ఉపఎన్నికలలో ఎలాగైనా టిఆర్ఎస్‌ను ఓడించాలని బిజెపి సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుండటంతో, దానిని నిలువరించి టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకొనేందుకు, సిఎం కేసీఆర్ ఉపఎన్నికలు ముగిసేవరకు మునుగోడులో మకాం చేయవచ్చని ఆ పార్టీ ముఖ్య నేతలు చెపుతున్నారు.
ఈ ఉపఎన్నికలు బిజెపికి ఎంత ముఖ్యమో బిఆర్ఎస్‌గా మారబోతున్న టిఆర్ఎస్‌కు కూడా అంతే ముఖ్యం. ఈ ఉపఎన్నికలలో ఓడిపోతే బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్న కేసీఆర్ నవ్వులపాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఈసారి మంత్రి హరీష్ రావుతో బాటు మంత్రి కేటీఆర్‌కు కూడా ఈ ఉపఎన్నికల బాధ్యతను సిఎం కేసీఆర్ అప్పగించారని భావించవచ్చు.
ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని బిజెపి గ్రహించినందునే ఎన్నికల గుర్తులు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చిందని టిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. బిజెపి వ్యూహాలకు చెక్ పెట్టేందుకు సిఎం కేసీఆర్ స్వయంగా రంగంలో దిగాలనుకొంటున్నారని ఆ పార్టీ ముఖ్యనేతలు చెపుతున్నారు. ఇక నిన్న మంత్రి కేటీఆర్ జగన్నాధం అనే బిజెపి నేతకి ఫోన్ చేసి ఉపఎన్నికలలో తమ అభ్యర్ధి గెలుపుకు సహకరించాలని కోరడం సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతోంది.
మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి సిఎం కేసీఆర్ తరలివస్తుండటం, కేటీఆర్‌కి కూడా బాధ్యతలు అప్పగించడం, ఆయన బిజెపి నేతకు ఫోన్ చేయడం గమనిస్తే ఈ ఉపఎన్నికలతో టిఆర్ఎస్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని, రెండో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తుందని, బిజెపి మూడో స్థానంలో నిలుస్తుందని కేసీఆర్ జోస్యం చెప్పినట్లు వార్తలు వస్తుండటం విశేషం. ఒకవేళ టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయం అయితే ఇవన్నీ ఎందుకు? అనే సందేహం కలుగకమానదు.
మునుగోడు ఉపఎన్నికలలో నవంబర్ 3న పోలింగ్ నిర్వహించి, 6న ఫలితాలు ప్రకటిస్తారు.