జయలలిత మృతిపై అనుమానాలున్నాయి: అర్ముగస్వామి కమీషన్‌

October 18, 2022


img

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరిపిన అర్ముగస్వామి కమీషన్‌ తన నివేదికను తమిళనాడు ప్రభుత్వానికి అందజేసింది. జయలలిత మృతిపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె స్నేహితురాలు శశికళతో సహా జయలలిత వ్యక్తిగత వైద్యుడు, శశికళ బంధువైన డాక్టర్ శివకుమార్, నాటి ఆరోగ్యమంత్రి, ఆరోగ్యశాఖ కార్యదర్శితో సహా పలువురిపై కమీషన్‌ అనుమానాలు వ్యక్తం చేసింది. వీరందరూ లేదా వీరిలో కొందరు కలిసి నేరపూరితంగా వ్యవహరించి జయలలిత మృతికి కారణం అయ్యారని కనుక ఈ కేసుపై పోలీసుల చేత లోతుగా దర్యాప్తు జరిపించి నేర నిర్దారణ చేయాలని కమీషన్‌ ప్రభుత్వానికి సూచించింది. 

జయలలితను హాస్పిటల్‌లో చేర్పించినప్పుడు ఆమెకు గుండెపోటు రాగా అత్యవసరంగా చేయవలసిన కొన్ని వైద్య చికిత్సలను చేయలేదని, కనుక ఇది నేరపూరితమైన చర్యగానే భావిస్తునట్లు కమీషన్‌ నివేదికలో పేర్కొంది. జయలలిత 2016, డిసెంబర్‌ 4వ తేదీ మధ్యాహ్నం మరణించగా ఆమె మర్నాడు మరణించినట్లు అపోలో హాస్పిటల్‌ వైద్యులు ప్రకటించడాన్ని కూడా కమీషన్‌ తప్పు పట్టింది. 

జయలలితను హాస్పిటల్‌లో చేర్చిన తర్వాత ఆమెను ఎవరూ కలవనీయకుండా శశికళ అడ్డుకొన్నారు. అప్పుడే ఆమెపై అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత జయలలిత కోలుకొన్నారని వార్తలు వెలువడిన కొన్ని గంటలలోపే ఆమె గుండెపోటుతో చనిపోయారని చెప్పడంతో ‘ఆమెను ఓ పద్దతి ప్రకారం హత్య చేయడానికే హాస్పిటల్‌లో చేర్చారని’ పన్నీరు సెల్వమ్ వంటి సీనియర్ అన్నాడీఎంకే పార్టీ నేతలు ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి విశ్రాంత న్యాయమూర్తి అర్ముగస్వామి నేతృత్వంలో కమీషన్‌ ఏర్పాటు చేశారు. 

ఆ కమీషన్‌ పలువురు ప్రత్యక్ష సాక్షులను, ఆమె వ్యక్తిగత వైద్యుడిని, హాస్పిటల్‌లో ఆమెకు చికిత్స చేసిన వైద్యులను, సిబ్బందిని, అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలను ప్రశ్నించి, జయలలితకు అందించిన చికిత్స తాలూకు మెడికల్ రికార్డులను పరిశీలించిన తర్వాత జయలలితది సహజమరణం కాదని, దీనిలో కుట్ర కోణం ఉందని నివేదికలో స్పష్టం చేసింది. ఈ నివేదికపై ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ ఎటువంటి నిర్ణయం తీసుకొంటారో త్వరలో తెలుస్తుంది.


Related Post