మన దేశంలో సినీ పరిశ్రమ ఇప్పుడు వందల కోట్లు పెట్టుబడితో అంతర్జాతీయస్థాయిలో సినిమాలు తీయగల స్థాయికి ఎదిగిందని సంతోషిస్తుంటే, వందల కోట్లు పెట్టి సినిమా తీసినా పట్టుమని పదిరోజులు కూడా థియేటర్లలో ఆడలేకపోవడం చాలా బాధాకరమే.
కర్ణుడి చావుకు వేయి కారణాలన్నట్లు ఓ సినిమా ఫెయిల్ అవడానికి కూడా అనేక కారణాలుంటాయని అందరికీ తెలుసు. వాటిలో ఓవర్సీస్ రివ్యూస్, ట్వీట్ రివ్యూస్ కూడా ఉన్నాయి. లైగర్ సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సింధు, ఆ సినిమాలో పస లేదని ట్వీట్ పెట్టేశాడు. దాంతో ఆ సినిమా రిలీజ్ కాక మునుపే నెగెటివ్ టాక్‌తో చంపేసినట్లయింది. లేకుంటే తొలిరోజున ఆ సినిమా చూసిన ప్రేక్షకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినందున ఓ పదిరోజులపాటు బాగానే నడిచి మంచి కలెక్షన్స్ రాబట్టుకొని ఒడ్డున పడి ఉండేది. కానీ ఓ సినిమాని తీయడం ఎంత కష్టమో తెలిసిన ఉమర్ సింధు వంటివారు కూడా నాలుగు వాఖ్యలతో వందల కోట్లు పెట్టి తీసిన సినిమాను రిలీజ్‌కు ముందే చంపేస్తున్నారు.
సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో రణబీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున తదితరులు ప్రధాన పాత్రలలో నటించిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9వ తేదీన విడుదల కాబోతోంది. కనుక దానిపై బాలీవుడ్, టాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకొన్నాయి. ప్రేక్షకులు కూడా దాని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఆ సినిమా గురించి కూడా ఉమర్ సింధు అప్పుడే కొన్ని నెగెటివ్ కామెంట్స్ పెట్టేశారు. సినిమా ఎలా ఉందో ప్రేక్షకులు చూసి నిర్ణయించుకొంటారు. సినిమా విడుదలైన తర్వాత సినీ విమర్శకులు చూసి చెపుతారు. కానీ సినిమా విడుదలయ్యేలోగానే, అది ఎలా ఉందో చెప్పేయాలనే ఆతృత ఎందుకు?నాలుగు వాఖ్యలతో నాలుగు వందల కోట్ల సినిమాను చంపేస్తున్నాననే ఆలోచన లేకపోవడం చాలా బాధాకరం. కనుక సినీ పరిశ్రమలో సమస్యల గురించి చర్చిస్తున్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ అంశంపై కూడా దృష్టి పెడితే మంచిది.