హైదరాబాద్‌లో ఈడీ సోదాలు… అందుకేనా?

September 06, 2022


img

సిఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవిత ఊహిస్తున్నట్లే ఈడీ బృందాలు హైదరాబాద్‌ వరకు వచ్చేశాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో దర్యాప్తులో భాగంగా ఈడీ బృందాలు నేడు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ స్కామ్‌లో ప్రధానపాత్రదారిగా భావిస్తున్న రామచంద్ర పిళ్ళైతో సంబందాలున్న హైదరాబాద్‌లోని సృజన్ రెడ్డి, అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్ ఇళ్ళలో నేడు 25 మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఇప్పటికే చెన్నైలోని రామచంద్ర పిళ్ళై నివాసాలు, కార్యాలయాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి కీలకపత్రాలు స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసులో సిఎం కేసీఆర్‌ కుమార్తె, టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్న సోదాలలో ఏవైనా ఆధారాలు లభిస్తే వాటితో కల్వకుంట్ల కవిత వద్దకు చేరుకొనే అవకాశం ఉంటుంది. లేదా మోడీ ప్రభుత్వాన్ని పదేపదే విమర్శిస్తూ గద్దె దించుతామని శపధాలు చేస్తున్న సిఎం కేసీఆర్‌కు మరోసారి గట్టిగా హెచ్చరించేందుకే ఈడీ బృందాలను హైదరాబాద్‌కు పంపిఉంటే ఇక్కడితో పని ముగించుకొని వారు వెనక్కు తిరిగి వెళ్ళిపోవచ్చు. 


Related Post