నేటి నుంచి తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే 6,12,13వ తేదీలలో కేవలం మూడు రోజులు మాత్రమే సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ్ళ తొలిరోజున జరిగే సమావేశంలో కేవలం సంతాప తీర్మానాలు మాత్రమే నిర్వహిస్తారు. తర్వాత ఉభయసభలు వాయిదా పడతాయి. ఆ తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశమయ్యి పనిదినాలు, అజెండాపై చర్చించి నిర్ణయం తీసుకొంటారు. మళ్ళీ సెప్టెంబర్ 12, 13 తేదీలలో సమావేశాలు జరిగినప్పుడు వివిద అంశాలపై చర్చ జరుగుతుంది.
ఆరు నెలల క్రితం జరిగిన సమావేశాలకు ఇవి కొనసాగింపు మాత్రమే కనుక ఈసారి కూడా ఉభయసభలను ఉద్దేశ్యించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం ఉండదు. ఆరు నెలల తర్వాత మొక్కుబడిగా మూడు రోజులు సమావేశాలను జరిపి, మళ్ళీ దానిలో ఒకరోజు సంతాప తీర్మానాలతో ముగించాలనుకోవడం గమనిస్తే టిఆర్ఎస్ ప్రభుత్వానికి శాసనసభ, మండలి సమావేశాల నిర్వహించాలనే ఆసక్తి తగ్గిపోయిందని అర్దమవుతోంది.
శాసనసభలో టిఆర్ఎస్ సంఖ్యాబలమే ఎక్కువగా ఉంది. దానికి మద్దతుగా మజ్లీస్ సభ్యులు కూడా ఉన్నారు. శాసనసభలో కాంగ్రెస్, బిజెపిలో చెరో ముగ్గురూ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వారిలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తుతం జైల్లో ఉండగా, మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అంటే శాసనసభలో కేవలం ప్రతిపక్ష సభ్యులు నలుగురు మాత్రమే ఉన్నారు.
స్పీకర్ టిఆర్ఎస్‌కు చెందినవారే కనుక ప్రతిపక్ష సభ్యులు గట్టిగా మాట్లాడితే వారిని సస్పెండ్ చేసి బయటకు పంపించే వెసులుబాటు కూడా ఉంది. అయినా టిఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభ సమావేశాలను నిర్వహించి, ప్రజా సమస్యలపై చర్చించడానికి ఆసక్తి చూపకపోవడాన్ని ఏమనుకోవాలి? శాసనసభ సమావేశాలు నిర్వహించడం అనవసరమని భావిస్తోందా?ఆరు నెలలకు ఓ సారి తప్పనిసరిగా శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించాలని రాజ్యాంగంలో నిబందన ఉండటం వలననే ఇప్పుడైనా నిర్వహిస్తోంది లేకుంటే ఇదీ నిర్వహించేది కాదేమో?