తెలంగాణ ఐటి, పరిశ్రమల మంత్రి కేటీఆర్ శనివారం ట్విట్టర్‌లో ఓ ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. తన తాతయ్య (తల్లి తరపు) జె.కేశవరావుతో చిన్నప్పుడు తాను, కవిత, సంతోష్ కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ, తన తాత గొప్ప స్పూర్తిదాయకమైన వ్యక్తి అని, గాంధీజీ బోధనలతో ప్రేరణ పొంది తెలంగాణ తిరుగుబాటు ఉద్యమంలో 1940లో నిజం నవాబుకి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. భారత ప్రభుత్వం ఆయనకు స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించిందని కేటీఆర్ పేర్కొన్నారు.
కేటీఆర్ తండ్రి తెలంగాణ సిఎం కేసీఆర్ నిజాం నవాబుల పట్ల తన ప్రేమను ఎన్నడూ దాచుకొనే ప్రయత్నం చేయలేదు. వారే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని చెప్పేవారు. బహుశః ఆ ప్రేమతోనో లేక మజ్లీస్‌కు భయపడో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి ఇష్టపడటం లేదు.
తెలంగాణలో పాగా వేయాలని చూస్తున్న బిజెపి, ఈసారి కేంద్ర ప్రభుత్వం తరపున సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడానికి సిద్దపడుతోంది. ఈ కార్యక్రమంలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించడానికి ఇష్టపడని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సికింద్రాబాద్‌లో నిర్వహించడం ద్వారా తెలంగాణ ప్రజలకు బలమైన సంకేతం ఇచ్చినట్లవుతుంది.
కనుక ఈ విషయం కేటీఆర్ ఇప్పుడు బయటపెట్టడం రాజకీయంగానే భావించాల్సి ఉంటుంది. అయినా సిఎం కేసీఆర్ నిజాం నవాబుల పట్ల అంత ప్రేమ కనబరుస్తున్నపుడు కేటీఆర్ అందుకు భిన్నంగా మా తాత నిజాం నవాబుతో పోరాడారని చెప్పుకోవడం కాస్త విడ్డూరంగా ఉంది కదా?
తెలంగాణ విమోచన దినోత్సవంతో బిజెపి మార్కులు కొట్టేయలని ప్రయత్నిస్తున్నందున టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక నుంచి తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని బహుశః మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినా ఆశ్చర్యం లేదు. కానీ మజ్లీస్‌కు కోపం వస్తేనే టిఆర్ఎస్‌కు కష్టం.