ఇంతకాలం సిఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీ, ఆయన ప్రభుత్వంపై ఎన్ని విమర్శలు చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్‌తో యుద్ధానికి సై అంటూ కత్తులు దూస్తోంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిన్న కామారెడ్డి జిల్లా బిక్మూరులో రేషన్ షాపు తనికీ చేసి కలెక్టర్‌ను నిలదీయడం ఇందుకు తాజా నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిఎం కేసీఆర్‌కు మరో పెద్ద షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని ప్రతీఏడు బిజెపి డిమాండ్ చేస్తోంది కానీ కేసీఆర్ ఏనాడూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మోడీ-అమిత్ షాలు తెలంగాణలో టిఆర్ఎస్‌ను ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని గట్టిగా నిర్ణయించుకొన్నందున తమ శక్తిసామర్ధ్యాలను కేసీఆర్‌కు రుచి చూపించబోతున్నారు.
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కర్ణాటక సిఎం బసవరాజు బొమ్మై, మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా పలువురు కేంద్ర మంత్రులు, బిజెపి అగ్రనేతలు హాజరుకానున్నారు. ఆ కార్యక్రమంలో కేంద్ర బలగాలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కవాతు నిర్వహించనున్నారు. అంటే చాలా ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
ఇన్నేళ్ళుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి నిరాకరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఇది ఊహించని షాకే అని చెప్పవచ్చు.
రాష్ట్రంలో ముస్లింల ఓట్ల కోసమే కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని బిజెపి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ముస్లింల ఓట్ల కోసం వెనకాడుతుంటే, బిజెపి రాష్ట్రంలోని హిందువులను ఆకట్టుకొనేందుకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు భావించవచ్చు. కనుక ఈరోజు జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ విమోచన దినోత్సవంపై కేసీఆర్ కూడా ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.