అక్కడ ఓ మహిళ చనిపోతే మంత్రి రాజీనామా... మరి ఇక్కడ?

September 01, 2022


img

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకొన్న నలుగురు మహిళలు మరణించగా మరో 11 మంది అపోలో హాస్పిటల్‌లో, మిగిలిన 19 మంది నీమ్స్ హాస్పిటల్‌లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇంతమంది మహిళలు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడితే చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నష్టపరిహారంతో సరి పెట్టేసింది తెలంగాణ ప్రభుత్వం. 

అదే పోర్చుగల్‌ దేశంలో ఒక భారతీయ గర్భిణి మహిళకు సకాలంలో వైద్యం అందించలేకపోవడంతో దానికి నైతిక బాధ్య వహిస్తూ ఆ దేశ ఆరోగ్యశాఖమంత్రి మార్తా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు. భారతీయ మహిళకు నెలలు నిండటంతో ప్రసవం కోసం పోర్చుగల్ రాజధాని నగరం లిస్బన్‌లో సాంతా మారియా ప్రభుత్వాసుపత్రిలో చేరేందుకు వెళ్లారు. అయితే అక్కడ హాస్పిటల్‌లో బెడ్స్ ఖాళీలు లేకపోవడంతో వైద్య సిబ్బంది ఆమెను వెంటనే అంబులెన్సులో నగరంలోని మరో హాస్పిటల్‌కు తీసుకువెళుతుండగా దారిలో ఆమెకు గుండెపోటు వచ్చింది. అంబులెన్స్ సిబ్బంది ఆమె ప్రాణాలు కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు కానీ సాధ్యం కాకపోవడంతో సిజేరియన్ చేసి ఆమె కడుపులోని శిశువు ప్రాణాలు కాపాడారు. 

ఈ ఘటనను నైతిక బాధ్యత వహిస్తూ ఆ దేశ ఆరోగ్యశాఖమంత్రి మార్తా టెమిడో తన పదవికి రాజీనామా చేశారు.  పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా ఈ ఘటనపై సందిస్తూ, దీనిపై విచారణకు ఆదేశించాము. కరోనా సమయంలో దేశానికి అత్యద్బుతమైన సేవలు అందించిన ఆరోగ్యశాఖమంత్రి మార్తా టెమిడో నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఇందుకు చాలా విచారిస్తున్నాం కానీ జరిగిన తప్పుకి ఓ నిండు ప్రాణం బలైపోయింది. కనుక ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నాను,” అని చెప్పారు. 

అక్కడ ఒక మహిళా చనిపోతే దేశ ఆరోగ్యశాఖమంత్రి నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేశారు. కానీ ఇక్కడ హైదరాబాద్‌లో నలుగురు మహిళలు చనిపోయి మరో 30 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంటే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు నష్టపరిహారం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళతో సరిపెట్టేశారు. ప్రాణం విలువ, నైతిక విలువలు దేశాన్ని బట్టి మారుతుంటాయని ఈ రెండు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 


Related Post