అలాంటి క్రిమినల్స్‌ని కటినంగా శిక్షించాలి: కేటీఆర్‌

August 29, 2022


img

జార్ఖండ్ రాష్ట్రంలో దుమ్కాలో  12వ తరగతి చదువుతున్న అనిత కుమారి అనే మైనర్ బాలికను షారూక్‌ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దాడిలో 90 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మరణించింది. పోలీసులు షారూక్‌ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అతనిని బహిరంగంగా ఉరి తీయాలంటూ దుమ్కా పట్టణంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుండటంతో పోలీసులు కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. అతనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా విచారణ చేయించి కటినమైన శిక్ష పడేలా చేస్తామని దుమ్కా సూపరింటెండెంట్‌ అంబర్ లక్డా చెప్పారు. 

ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ, “షారూక్ వంటి భయంకరమైన క్రిమినల్స్‌కి సమాజంలో చోటు లేదు. అతనిని ఏమాత్రం ఉపేక్షించరాదు. మన చట్టంలో లొసుగులను ఉపయోగించుకొని ఇటువంటి నేరస్తులు తప్పించుకు పోకుండా క్రిమినల్, బాలనేరస్తుల చట్టాలను సవరణ చేయాలి. కటినమైన చట్టాలున్నప్పుడే ఇటువంటి నేరాలు పునరావృతం కాకుండా నివారించగలము,” అని ట్వీట్ చేశారు. 

నిజమే ఇటువంటి హేయమైన నేరానికి పాల్పడినవారు శిక్షలు పడకుండా తప్పించుకొనే అవకాశం ఉన్నందునే నేరాలు చేసేందుకు నేరస్తులు భయపడటం లేదు. కనుక అవసరమైతే చట్టసవరణలు చేసైనా సరే అత్యంత కటినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. 

హైదరాబాద్‌ నడిబొడ్డున జూబ్లీహిల్స్‌లో పట్టపగలు ఆరుగురు వ్యక్తులు ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి సామూహిక అత్యాచారం చేసినప్పుడు మంత్రి కేటీఆర్‌ ఇదేవిదంగా స్పందించారు. కానీ ఆ తర్వాత ఆరుగురు నిందితులు బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చేశారు. నిందితులు అత్యంత పలుకుబడిన రాజకీయ నాయకుల పిల్లలు కనుకనే అందరూ అంతా త్వరగా, సులువుగా బెయిల్‌పై బయటకు వచ్చేశారనేది బహిరంగ రహస్యం. 

ఇదివరకు దిశ కేసులో నలుగురు నిందితులను  పోలీసులు పట్టుకెళ్ళి భూటకపు ఎన్‌కౌంటర్ చేసేశారని జస్టిస్ సిర్పూర్కర్ కమీషన్‌ నివేదికలో పేర్కొంది. తాము నిరుపేదలం కనుక వారిని పోలీసులు భూటకపు ఎన్‌కౌంటర్ చేసేశారని నిందితుల తల్లితండ్రులు, భార్య ఆరోపిస్తున్నారు. అంటే ఒకరికి ఒకలా మరొకరికి మరొకలా చట్టం, న్యాయం అమలవుతుందని స్పష్టమవుతోంది. 

జూబ్లీహిల్స్‌ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురు నిందితులు దర్జాగా నగరంలో తిరుగుతుంటే, వారికి తెలంగాణ ప్రభుత్వం కటినమైన శిక్షపడేలా చేయలేనప్పుడు, మంత్రి కేటీఆర్‌ వేరొక కేసులో కటినమైన శిక్ష విధించాలని ఏవిదంగా కోరగలరు?             



Related Post