కాంగ్రెస్‌ ముక్కలైపోతుంటే... రాహుల్ భారత్‌ జోడో యాత్ర!

August 29, 2022


img

2014 ఎన్నికల వరకు పదేళ్ళపాటు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనుగడ కాపాడుకొనే దుస్థితికి దిగజారిపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఓటమికి రాహుల్ గాంధీ నైతిక బాధ్యతవహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు ఉండి ఉంటే అస్త్ర సన్యాసం చేసి వృద్ధురాలైన తన తల్లిపై భారం వేసేవారే కాదు. ధైర్యంగా పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని ముందుకు నడిపించేవారు. కానీ పార్టీ పరిస్థితిని గ్రహించినందునో లేక తన నాయకత్వాన్ని కొందరు ప్రశ్నిస్తుండటం వలననో నేటికీ ఆయన పార్టీ పగ్గాలు చేపట్టానికి నిరాకరిస్తున్నారు. కానీ నేటికీ తానే కాంగ్రెస్‌ అధినేతనన్నట్లు వ్యవహరిస్తున్నారు. అన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా ఆయనే తమ అధినేత అని భావిస్తున్నారు.

సెప్టెంబర్‌ 7వ తేదీన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్‌ జోడో పేరుతో పాదయాత్ర చేస్తుండటం, దానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాధాన్యత ఇస్తుండటమే ఇందుకు నిదర్శనం. దేశంలో 12 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా రాహుల్ గాంధీ భారత్‌ జోడో పాదయాత్ర చేయబోతున్నారు. 

గమ్మతైన విషయం ఏమిటంటే ఓ పక్క పార్టీలో సీనియర్లు రాజీనామాలు చేసి వెళ్లిపోతుంటే ముందు పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేయకుండా భారత్‌ జోడో అంటూ దేశాటనకి బయలుదేరుతున్నారు. మోడీ ప్రభుత్వం దేశప్రజల మద్య మత విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని విభజిస్తోందని, కనుక బిజెపి నుంచి దేశాన్ని కాపాడేందుకే భారత్‌ జోడో యాత్ర అని కాంగ్రెస్ పార్టీ పైకి చెప్పుకొంటోంది. అయితే సొంత పార్టీని కాపాడుకోలేని వ్యక్తి దేశాన్ని ఏవిదంగా కాపాడగలడు?అనే ప్రశ్నకు కాంగ్రెస్‌ నేతలే సమాధానం చెప్పాలి. అసలు కాంగ్రెస్‌ ఇంత దీనస్థితికి రావడానికి కారణం ఆయనే అని మొన్న రాజీనామా చేసి వెళ్ళిపోయిన గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. మరో 23 మంది సీనియర్ కాంగ్రెస్‌ నేతలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.    

ఓ పక్క కాంగ్రెస్ మునిగిపోతుంటే, మరోపక్క పార్టీలో సీనియర్స్ వెళ్ళిపోతుంటే ఏమి చేయాలో పాలుపోకనే రాహుల్ గాంధీ దేశాటనకు బయలుదేరారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మేలు జరుగుతుందో లేదో తెలీదు కానీ రాహుల్ గాంధీకి ఖచ్చితంగా మరింత లోకజ్ఞానం పెరుగుతుందని చెప్పవచ్చు.


Related Post