జాతీయ రాజకీయాలలో కేసీఆర్‌ తొలి అడుగు వేశారా?

August 29, 2022


img

సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు కానీ ఎప్పటికప్పుడు ఏవో అవాంతరాల కారణంగా ఆలస్యమవుతోంది. మొదట ఆయన బిజెపియేతర ప్రభుత్వాలను, పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేశారు. కానీ ఎవరి రాజకీయ అవసరాలు, సమస్యలు వారికి ఉంటాయి కనుక ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 

కనుక ఇప్పుడు దేశంలో రైతులను సంఘటితపరిచి తన లక్ష్యం చేరుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌ తన లక్ష్య సాధనకు రైతులను ఎంచుకోవడానికి చాలా బలమైన కారణమే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది రైతులకు ఇంతకాలం అసంఘటితంగా ఉన్నారు. వారిని సంఘటిత పరిచే బలమైన నాయకుడు లేరనే కేసీఆర్‌ గుర్తించారు. కానీ వారు సంఘటితమైతే ఫలితం ఏవిదంగా ఉంటుందో కొన్ని రైతు సంఘాలు ఢిల్లీ శివార్లలో ఏడాదిపాటు ఆందోళనలు చేసి మోడీ ప్రభుత్వ మెడలు వంచడంతో గ్రహించారు. 

అందుకే దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నేతలను తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించి, ముందుగా వారికి రాష్ట్రంలో సాగునీరు, వ్యవసాయ రంగాలలో అభివృద్ధిని స్వయంగా చూసేందుకు పర్యటనలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రెండు రోజులు ప్రగతి భవన్‌లో తెలంగాణ అభివృద్ధికి సంబందించిన డాక్యుమెంటరీ వీడియోలు చూపించారు. రెండు రోజుల సమావేశాలు నిర్వహించి వారి సమస్యలపై లోతుగా చర్చలు జరిపారు. వారితో కలిసి భోజనం చేశారు. తద్వారా 26 రాష్ట్రాలలో రైతు సంఘాల నేతలతో కేసీఆర్‌ నేరుగా స్నేహసంబంధాలు నెలకొల్పుకోగలిగారని చెప్పవచ్చు.   

ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ అనాడూ తాను తెలంగాణ ప్రజలందరినీ ఏకం చేసి తెలంగాణ సాధించినట్లే ఇప్పుడు దేశంలో రైతులందరూ ఏకమై కేంద్రంలో రైతు అనుకూల ప్రభుత్వం ఏర్పాటుచేసుకొందామని చెప్పారు. రైతులు కూడా రాజకీయాలలోకి, చట్టసభలలోకి ప్రవేశించినప్పుడే వారి సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ కార్యాచరణ కోసం మరోసారి సమావేశమవుదామని చెప్పారు. 

తెలంగాణలో వ్యవసాయ, సాగునీటి రంగాలకు సంబందించి రైతు సంఘాల నేతలు స్వయంగా కళ్ళారా చూసిన వాటి గురించి, సిఎం కేసీఆర్‌ చెప్పిన మాటలపై రైతులు తప్పకుండా ఆలోచించుకొంటారని వేరే చెప్పక్కరలేదు. ఈ సమావేశాలతో వారికి తన నాయకత్వ లక్షణాలు అర్దమయ్యేలా చేశారని చెప్పవచ్చు.

తమ సమస్యల గురించి ఇంత అవగాహనతో మాట్లాడే బలమైన నాయకుడు కేసీఆర్‌ అని వారు కూడా ఈపాటికి గుర్తించే ఉంటారు. సాధారణ రైతులు రాజకీయాలలోకి రాలేకపోవచ్చు. కానీ కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తే వారు తప్పకుండా మద్దతు ఇస్తారని చెప్పవచ్చు. కనుక కేసీఆర్‌ ఆ దిశలో తొలి అడుగు వేసినట్లే భావించవచ్చు. 


Related Post